నందమూరి హరికృష్ణ మరణం రెండు తెలుగురాష్ట్రాల నందమూరి అభిమానులకు చాలా విషాదకరమైన విషయమనే చెప్పాలి. మెహిదీపట్నంలో హరికృష్ణ భౌతికకాయం ఉంచిన నివాసం వద్ద సినీ,రాజకీయ ప్రముఖులంతా ఆయన భౌతిక కాయాన్ని సందర్సించి నివాళులర్పిస్తున్నారు. అన్నయ్య మరణంతో కన్నీరుమున్నీరైనా బాలకృష్ణ మీడియాతో ఆయన మాట్లాడుతూ అన్నయ్య హరికృష్ణ లేకపోవడం తనకు, తమ కుటుంబానికే కాదు పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు తీరని లోటని నందమూరి అన్నారు.
ఆయన మన మధ్య లేకపోవడం చాలా బాధకరమని, ఆయనకు బంధుప్రీతి ఎక్కువని, మా ఊరు వెళ్లినప్పుడు ప్రతిఒక్క బంధువును కలిసి, పలకరించేవారని అన్నారు. అలాగే, పార్టీలో కూడా అందరితో కలుపుగోలుతనంగా ఉండేవారని, అటువంటి ఆయన లేరంటే నమ్మబుద్ధి కావడం లేదని చెమ్మగిల్లిన కళ్లతో చెప్పుకొచ్చారు. సంస్కృతీ సంప్రదాయాలకు హరికృష్ణ విలువ నిచ్చేవారని, తమ ఇళ్లలో జరిగే ఫంక్షన్లకు వస్తుండేవారని, హరికృష్ణ చూస్తుంటే తండ్రిని చూస్తున్నట్టే ఉండేదని అన్నారు. అందరూ ఏదో ఒకరోజు పోవాల్సిన వాళ్లేమని, కానీ ఈ విధంగా చనిపోవడం అనేది ఎంతో బాధాకరంగా ఉందని బాలకృష్ణ తన ఆవేదన వ్యక్తం చేసారు.