త్వరలోనే నమస్తే ఆంధ్రప్రదేశ్ పత్రిక

66
- Advertisement -

తెలంగాణ గుండె చప్పుడు నమస్తే తెలంగాణ పత్రిక. స్వరాష్ట్ర సాధనలో తెలంగాణ ఉద్యమకారుల పోరాటాన్ని ఏ పత్రిక కూడా ప్రధానంగా ప్రచురించని రోజుల్లో నేనున్నానంటూ నమస్తే తెలంగాణ ఉద్యమ గొంతుకగా మారింది. తెలంగాణ సాధనే లక్ష్యంగా పని చేసిన టీఆర్‌ఎస్‌ పార్టీకి, ఉద్యమకారులకు వెన్నుదన్నుగా నిలిచింది.

2010 జూన్‌ 6న పురుడు పోసుకున్న నమస్తే తెలంగాణ అనతికాలంలోనే ప్రజల మన్ననలు పొందింది. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజలు పడుతున్న కష్టాలను, బాధలను, మన వనరులను తరలించుకుపోతున్న సమైక్య పాలకుల కుట్రలను ఎలుగెత్తి చాటింది. ఉద్యమ నేత కేసీఆర్‌ సాగించిన పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచింది. ఉద్యమం కోసం స్వరాష్ట్రం కోసం పోరాడిన నమస్తే తెలంగాణ ఆ తర్వాత రాష్ట్ర అభివృద్ధిలో పునరంకితం అయింది. ప్రభుత్వ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా నిలిచింది.

తాజాగా టీఆర్ఎస్ బీఆర్ఎస్‌గా మారడంతో దేశవ్యాప్తంగా పార్టీని విస్తరించే పనిలో ఉన్నారు కేసీఆర్. సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలపై దృష్టిసారించిన నేపథ్యంలో నమస్తే తెలంగాణ ను కూడా అన్ని రాష్ట్రాల్లో విస్తరించాలని భావిస్తోంది. మొదటగా ఏపీ లో నమస్తే ఆంధ్రప్రదేశ్ గా అందుబాటులోకి రానుంది. రానున్న రోజుల్లో అన్ని రాష్ట్రాల్లో విస్తరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆర్ ఎన్ ఐ అనుమతి తోపాటు అన్ని అనుమతులు వచ్చాయి. దీంతో త్వరలోనే అధికారికంగా నమస్తే ఆంధ్రప్రదేశ్‌ని లాంఛ్‌ చేయనున్నారు.

ఇవి కూడా చదవండి..

- Advertisement -