నామన్ ఓఝా కన్నీటి వీడ్కోలు..

181
Naman Ojha
- Advertisement -

అంతర్జాతీయ, దేశవాళీ క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్టు 37 ఏళ్ల ఓఝా రిటైర్మెంట్ ప్రకటించాడు. భారత్ తరపున అన్ని ఫార్మాట్లలోనూ ఆడిన నామన్.. ఒక టెస్టు, ఒక వన్డే, రెండు టీ20లలో భారత్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 2010లో జింబాబ్వేలో పర్యటించిన భారత జట్టులో సభ్యుడైన ఓఝా ఒకే ఒక్క వన్డే మ్యాచ్ ఆడగా, 2015లో శ్రీలంకతో కొలంబోలో జరిగిన టెస్టులో ఆడాడు. మధ్యప్రదేశ్ దేశవాళీ క్రికెట్‌లో గొప్ప ఆటగాడిగా పేరు సంపాదించుకున్న నామన్ ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో 20 సీజన్లపాటు ఆడాడు.

రంజీల్లో అత్యధిక మందిని అవుట్ చేసిన వికెట్ కీపర్‌గా రికార్డులకెక్కాడు. 146 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 9753 పరుగులు చేశాడు. ఇందులో 22 సెంచరీలు, 55 అర్ధ సెంచరీలు ఉన్నాయి. అత్యధిక స్కోరు 219 నాటౌట్. అలాగే, 143 లిస్ట్ ఎ మ్యాచ్‌లు, 113 ఐపీఎల్ మ్యాచ్‌లు సహా 182 టీ20లు ఆడాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ డేర్‌డెవిల్స్, రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకు ప్రాతినిధ్యం వహించాడు. తన రిటైర్మెంట్‌ను ప్రకటిస్తూ ఓఝా కంటతడి పెట్టుకున్నాడు.

ఈ సందర్భంగా ఓఝా మాట్లాడుతూ, జూనియర్ కాంపిటీషన్లతో పాటు దాదాపు 20 ఏళ్లు క్రికెట్ ఆడానని చెప్పాడు. ఆట నుంచి తప్పుకోవాల్సిన సమయం ఇప్పుడు ఆసన్నమైందని అన్నాడు. ఇది తన జీవితంలో ఒక సుదీర్ఘమైన దశ అని చెప్పాడు. తన కెరీర్‌కు అండగా నిలిచిన మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్, బీసీసీఐకి ధన్యవాదాలు చెపుతున్నానని అన్నాడు. దేశం కోసం ఆడాలనే తన కలను నెరవేర్చుకోవడానికి తనకు మద్దతుగా నిలిచిన కోచ్‌లు, సెలక్టర్లు, ఫిజియోలు, కెప్టెన్లు, కుటుంబసభ్యులు, శ్రేయోభిలాషులు అందరికీ కృతజ్ఞతలు తెలియజేశాడు.

- Advertisement -