మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం సుకుమార్ డైరెక్షన్లో రంగస్థలం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. పూర్తి గ్రామీణ నేపధ్యంలో తెరకెక్కుతున్న చిత్రమిది . సమంత హీరోయిన్గా నటిస్తుంది. అయితే చరణ్ ఈ సినిమా పూరైన తర్వత కొరటాల శివ డైరెక్షన్లో ఒక చిత్రం చేయబోతున్నాడు. మ్యాట్నీ ఎంటర్ టెయిన్మెంట్ బ్యానర్‌పై కొణిదల ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మించనున్నారు.
కాగా కొరటాల సినిమాతోపాటు మరో సినిమా ప్రారంభించేందుకు చరణ్ సిద్దమౌతున్నాడట. సినిమా చూపిస్త మావ – నేను లోకల్ సినిమాలతో బంపర్ హిట్లు కొట్టిన దర్శకుడు నక్కిన త్రినాథరావు కలిసి ఈ సినిమా చేసేందుకు అవకాశముంది. ఈ సినిమా స్టోరీకి కావల్సిన మెయిన్ పాయింట్ మెగాస్టార్ చిరంజీవి సినిమా నుండి తీసుకోవడం ప్రత్యేకమైన విషయం. చిరంజీవి ఒకనాటి సూపర్ హిట్ మూవీ మంత్రి గారి వియ్యంకుడు నుంచి లీడ్ పాయింట్ తీసుకుంటున్నారనేది టాక్.అయితే డైరెక్టర్ నక్కిన త్రినాథరావు తన అసిస్టెంట్లతో కలిసి దీనికి సంబంధించి ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ చేస్తున్నారు. మంత్రి గారి వియ్యంకుడు ఆ రోజుల్లో యూత్ కు తెగ నచ్చేసింది. ఈ స్టోరీని ఇప్పటి ట్రెండ్ కు తగ్గట్టుగా మార్చి తెరకెక్కించాలని చూస్తున్నారు.
ఈ స్టోరీ విషయాన్ని చరణ్ దగ్గర ప్రస్తావించగా ముందు పూర్తి కథ సిద్దం చేయమని అప్పుడు కథ విన్నాక దీనిపై తన అభిప్రాయం తెలియజేస్తానని చెప్పాడట. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే సినిమాని దిల్ రాజు నిర్మించేందుకు రెడీగా ఉన్నాడని సమాచారం.కాని చిరంజీవి నటించిన మంత్రి గారి వియ్యంకుడు సినిమా అప్పట్లో మంచి విజయం అందుకుంది. మరి ఇప్పుడున్న యూత్‌కి ఈ సినిమా నచ్చుతుందో లేదో.. ఈ ప్రాజెక్ట్‌పై దర్శకుడు నక్కిన త్రినాథరావు మాత్రం చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. మరి ఈ సినిమా పట్టాలెక్కుతుందో లేదో మరికొంత కాలం వేచి చూడాలి.