బీజేపీ నేతలకు క్షవరం కష్టాలు…

105
ts
- Advertisement -

తెలంగాణ సీఎం కేసీఆర్ దెబ్బకు రాష్ట్ర బీజేపీ నేతలకు కొత్తగా క్షవరం కష్టాలు మొదలయ్యాయి. ఇటీవల ప్రగతి భవన్‌లో ప్రెస్‌మీట్ పెట్టిన సీఎం కేసీఆర్ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువస్తున్న కొత్త విద్యుత్ సంస్కరణలు అమలు చేస్తే… బాయిల కాడ రైతుల వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టి చార్జీలు మోత మోగించడంతో పాటు, రాష్ట్రంలో నాయిబ్రాహ్మణుల సెలూన్లకు, రజకులకు ఇస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్ సబ్సిడీ కట్ అయిపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు కేసీఆర్ సర్కార్ అందిస్తున్న కరెంట్ సబ్సిడీతో రాష్ట్రవ్యాప్తంగా నాయిబ్రాహ్మణులు, రజకులు హ్యాపీగా ఉన్నారు.

కొత్త విద్యుత్ సంస్కరణలను అమలు చేయాలని కేంద్రం మెడమీద కత్తి పెట్టి బెదిరిస్తుందని సీఎం కేసీఆర్ చెప్పడంతో ఆయా వర్గాల్లో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో నాయిబ్రాహ్మణ, రజక సంఘాలు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాట బాట పడుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య నేతృత్వంలో నాయిూబ్రాహ‌్మణ, రజక సంఘాల నేతలు సమావేశమయ్యారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ వైఖరి వల్ల కులవృత్తులకు ముప్పు ఏర్పడిందని.. విద్యుత్ సంస్కరణల పేరిట తమ కడుపు మీద కొట్టేందుకు కేంద్రం పూనుకుందని ధ్వజమెత్తారు.నూతన విద్యుత్ చట్టం ముసాయిదాలో సబ్సిడీలు ఎత్తివేయాలని.. ఉచిత విద్యుత్ ను రద్దు చేయాలని కేంద్రం పేర్కొనడాన్ని నాయీ బ్రాహ్మణ సంఘం నేతలు ఖండించారు.

తెలంగాణలో కేసీఆర్ సర్కార్ తమకు అమలు చేస్తున్న 250 యూనిట్ల ఉచిత విద్యుత్ పథకం కేంద్రం వైఖరి వల్ల రద్దయ్యే ప్రమాదం ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో పోరుబాటకు నాయిబ్రాహ్మణ, రజక సంఘాలు సిద్ధమవుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి నిరసనగా ఈనెల 20 నుంచి నల్లబ్యాడ్జీ లు ధరించి ఆందోళన చేస్తామని ప్రకటించాయి.

ఈ క్రమంలోనే రాష్ట్రవ్యాప్తంగా హైదరాబాద్ నగరంతో సహా, అన్ని పట్టణాలు, మండల కేంద్రాలు, గ్రామాల్లోని సెలూన్ షాపుల్లో బీజేపీ నేతలకు, కార్యకర్తలకు నో కటింగ్, నో షేవింగ్ అని బోర్డులు పెట్టి వారికి క్షవరం చేసేందుకు నిరాకరించాలని నాయి బ్రాహ్మణ సంఘాల నేతలు పిలుపునిచ్చారు. దీంతో బీజేపీ నేతలు, కార్యకర్తలకు క్షవరం కష్టాలు తప్పేలా లేవు..అయితే మా పార్టీ అగ్రనేతలు బండి సంజయ్, అర్వింద్‌లకు ఎలాగూ గుండు, అరగుండు ఉంది కాబట్టి వారికి జుత్తు పెరిగినా పెద్దగా సమస్యలేదని, ఉన్న కొద్ది జుట్టును ట్రిమ్మర్‌తో కత్తిరించుకుంటారని, కాని మా పరిస్థితి ఏంటని, జుట్టు, గడ్డాలు పెరిగి కాషాయ నేతలం కాస్తా కాషాయ సన్యాసుల్లా మారిపోతామని కొందరు బీజేపీ నేతలు వాపోతున్నారు. ప్రస్తుతం బీజేపీ నేతలకు, కార్యకర్తలకు క్షవరం చేయరాదన్న నాయిబ్రాహ్మణ సంఘం తీర్మానం సర్వత్రా హాట్‌టాపిక్‌గా మారింది.

- Advertisement -