తెలుగు భాష మాధుర్యం తెలిసిన ఇప్పటి సంగీత దర్శకుల్లో కీరవాణి ఒకరు. భాష గురించి, భావం గురించి, సాహిత్యం గురించి బాగా తెలుసు. అందుకే అచ్చమైన సంగీతాన్ని అందిస్తున్నారు ఆయన సంగీత దర్శకుడు మాత్రమే కాదు, రాగాలు కట్టే ఈయన వాటిని తన గొంతులో పలికించగలరు. ఆయన గొంతులో భక్తి భావం తొణికిసలాడుతుంది. భక్తిరసాన్వితమైన ఎన్నో గీతాల్ని కీరవాణి సినిమాలకోసం పాడారు. నేడు ఆయన పుట్టిన రోజు సందర్భంగా గ్రేట్తెలంగాణ.కామ్ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాం.
కీరవాణి పాటలు వింటుంటే ఏదో తెలియని మధురానుభూతి కలుగుతుంది. తొలినాళ్లలో రాజమణి, చక్రవర్తి వంటి ప్రసిద్ధ సంగీత దర్శకుల వద్ద సహాయకునిగా పనిచేసాడు. ప్రముఖ సినిమా నిర్మాణ సంస్థ ఉషా కిరణ్ మూవీస్ వారు 1989లో నిర్మించిన మనసు – మమత తెలుగు చిత్రం ద్వారా ఎం. ఎం. కీరవాణి తెరనామంతో సంగీత దర్శకునిగా వెండి తెరకు పరిచయమయ్యాడు. ఆ తరువాత అనేక తరహా చిత్రాలకు సంగీతాన్ని అందించారు. కీరవాణి సంగీతం సమకూర్చిన సినిమాలలో చెప్పుకోదగినవి సీతారామయ్యగారి మనవరాలు, క్షణ క్షణం, అల్లరి మొగుడు, మేజర్ చంద్రకాంత్, అల్లరి ప్రియుడు, అన్నమయ్య, శ్రీరామదాసు, నేనున్నాను, స్టూడెంట్ నంబర్ 1, ఛత్రపతి, సింహాద్రి, అనుకోకుండా ఒక రోజు, ఆపద్బాంధవుడు, శుభ సంకల్పం, పెళ్లి సందడి మరియు సుందరకాండ.
ఎన్నో సినిమాలకు ఉత్తమ సంగీతాన్ని అందించిన కీరవాణి.. ఉత్తమ సంగీత దర్వకుడిగా ఆయన జాతీయ అవార్డును పొందారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎనిమిదిసార్లు నంది అవార్డులు, నాలుగుసార్లు ఫిలింఫేర్ అవార్డులు, తమిళనాడు రాష్ట్ర ఫిలిం అవార్డును కూడా అందుకొన్నారు. ఆమధ్య ఈగ వంటి ప్రయోగాత్మక సినిమాకు సంగీతం అందించిన కీరవాణి .. అంతర్జాతీయ ఖ్యాతి గడించిన బాహుబలికి కూడా సంగీతాన్ని సమకూర్చారు. అందుకే కీరవాణిని సాహో అంటున్నారు.కీరవాణి ఆ మధురానుభూతిని తెలుగు సినిమాలకే పరిమితం చేయలేదు. తమిళం, కన్నడం, మలయాళం, హిందీ చిత్రాలకు కూడా ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందిస్తున్నారు. చిత్రమేంటంటే తమిళంలో ఆయనను మరగత మణి అని, బాలీవుడ్ లో ఎం ఎం క్రీం అని అంటారు.