మునుగోడు ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు మద్దతుగా ఎన్నారైలు

191
- Advertisement -

మునుగోడు ఉప ఎన్నిక‌లో టీఆర్‌ఎస్‌దే గెలుపు అని మంత్రి జగదీశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. మునుగోడులోని ఒక ఫంక్షన్ హాల్ లో ఎన్నారై టీఆర్ఎస్ -యూకే లండన్‌ శాఖ వారి ఆధ్వర్యంలో ఉప ఎన్నిక సందర్భంగా ప్రచార కరపత్రాలను ప్రచురించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర చలనచిత్ర టీవీ థియేటర్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అనిల్‌, ఎన్నారై లండన్‌ శాఖ సభ్యులతో కలిసి మంత్రి జగదీశ్వర్‌రెడ్డి ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… తెలంగాణ ఉద్యమ సమయం నుండి ఎన్నారై టీఆర్ఎస్ లండన్ శాఖ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారన్నారు. ప్రతి ఎన్నికల్లో క్షేత్త్రస్థాయిలో పాల్గొన్నారని వారిని అభినందించారు. వారు ఇంటింటికీ వెళ్లి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపునకు కృషి చేయాలని కోరారు.

టీఆర్ఎస్ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్య‌క్ర‌మాలే టీఆర్‌ఎస్‌ పార్టీని గెలిపిస్తాయని, టీఆర్‌ఎస్‌ గెలుపును ఎవరు ఆపలేరన్నారు. ఈసందర్బంగా బీజేపీకి దక్కేది మూడో స్థానమేనని స్పష్టం చేశారు.

ఎఫ్.డి.సి చైర్మన్ అనిల్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలే టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తాయని స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా ఉన్న రాజగోపాల్ రెడ్డి కేంద్రం వద్ద కాంట్రాక్టుల కోసం వ్యక్తిగత ప్రయోజనాల కోసం పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరి ఉపఎన్నికకు కారణమయ్యారని దుయ్యబట్టారు. మునుగోడులో దశాబ్ధాలగా ఫ్లోరోసిస్ వ్యాధికి ముఖ్యమంత్రి కేసీఆర్ శాశ్వత విముక్తి కల్పించారని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎన్నారై టీఆర్ఎస్ నాయకులు శానబోయిన రాజ్ కుమార్, వల్లాల శ్రీనివాస్, ప్రవీణ్, సుభాష్, రావుల పృథ్వి, టీఆర్ఎస్ నాయకులు నరేష్ గౌడ్, రమేష్, కార్తిక్, రాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -