డబ్బులు అడుగుతున్న ఓటర్లు

253
munugodu
- Advertisement -

ఆశపెట్టి ఎగొట్టిన బిజెపి
బిజెపి నేతల ఇళ్ళవద్ద ఓటర్ల ఆందోళన
సరికొత్త ట్రెండ్ కు మునుగోడు వేదిక

మునుగోడు అసెంబ్లీ సెగ్మెంట్ ఉప ఎన్నికలు సరికొత్త సంప్రదాయానికి వేదిక అయ్యింది. ఓట్ల కోసం డబ్బులు వెదజల్లితే తీసుకునే ఓటర్లు గుట్టుచప్పుడు కాకుండా మసులుకునేవారు. కానీ నేడు మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గంలోని కొన్ని గ్రామాల్లోని ప్రజలు స్థానిక నాయకుల ఇళ్ళ వద్ద డబ్బుల కోసం, తులం బంగారం కోసం ధర్నాలు చేయడం, ఆందోళనలు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఓటుకు అయిదు నుంచి పది వేల రూపాయల వరకూ ముట్టజెబుతామని బిజెపి నేతలు ఆశపెట్టారని, అంతేగాక ఇంటికి ఒక తులం (10 గ్రాములు) బంగారం ఇస్తామని కూడా వాగ్దానాలు చేసి ఇందులో ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని పలు గ్రామాల్లోని ఓటర్లు స్థానిక భారతీయ జనతా పార్టీ (బిజెపి) నాయకుల ఇళ్ళ వద్ద ధర్నాలు చేశారు. ఇలా ఓట్లకు డబ్బుల
కోసం, బంగారం వంటి ఇతరత్రా బహుమతుల కోసం ఓటర్లు బహిరంగంగానే ఆందోళనలకు దిగడం చర్చనీయాంశంగా మారింది.

బిజెపి పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టు వచ్చిందంట కదా, అందులో నుంచి ఓటర్లకు డబ్బులు పంచుతుండు కదా… తీసుకుంటే తప్పేముంది… మేం పేదోళ్లం… డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్నాం… కూలీనాలీ చేసుకుని బతికేటోల్లం… ఇలా పైసలిస్తానని ఇవ్వకుండా ఎగొడితే ఎలా సారూ… అని గ్రామస్తులు స్థానిక కమలం పార్టీ నేతలను నిలదీస్తున్న వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఉప ఎన్నికలు వచ్చిందే ఆ 18 వేల కోట్ల రూపాయల నిధుల కోసమే కదా… మేం ఓట్లేసి గతంలో గెలిపిస్తేనే కదా ఆయనగారికి 18 వేల కోట్లు వచ్చినయ్… ఆ సొమ్మేలోంచే కొంత మాకూ పంచుతున్నడు కదా… అందుకే అడుగుతున్నాం…. అని ఓటర్లు నిలదీసిన వైనం సంచలనంగా మారింది. ఎన్నికల్లో ఓట్లను డబ్బును ఎరగా చూపించి కొనుగోలు చేయడం నేరమే, అదే విధంగా తన ఓటును డబ్బుకు అమ్ముకోవడమూ నేరమే… అని ఎన్నికల సంఘం చట్టాలు స్పష్టం చేస్తున్నాయి. అయినప్పటికీ ఇందులో ఎన్నికల సంఘం కానీ, పోలీసులు గానీ ఎవ్వరూ జోక్యం చేసుకోవడం లేదని, ఎవ్వరూ ఫిర్యాదులు చేసే పరిస్థితులు కూడా లేవని కొందరు రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఎందుకంటే ఓటర్లపైన ఫిర్యాదులు చేస్తే ఓట్లు వేయరని బరిలో నిలిచిన అభ్యర్ధులు మౌనంగా ఉంటున్నారని, అదే విధంగా ఫలానా అభ్యర్థి తనకు ఓటుకు డబ్బును ఆశగా చూపాడని ఏ ఓటర్ కూడా ఫిర్యాదులు చేసిన దాఖలాలు లేవని ఎనికల విధుల్లో ఉన్న కొందరు సీనియర్ అధికారులు వివరించారు.

డబ్బుల విషయంలో ఓటర్, అభ్యర్థి… ఇద్దరూ తోడు దొంగలే కాబట్టి ఒకరిపై మరొకరు ఫిర్యాదులు చేసుకోరని వివరించారు. డబ్బుల వ్యవహారం ముదిరిపాకానపడి చివరకు డబ్బుల కోసం ధర్నాలు, ఆందోళనలు చేసే వరకూ పరిస్థితులు దిగజారాయంటే అభ్యర్ధులకు అప్పనంగా, అడ్డగోలుగా వస్తున్న నిధులే ప్రధాన కారణమని, దొడ్డిదారుల్లో వందలు, వేల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్నారనే విషయం ఓటర్లకు కూడా చాలా స్పష్టంగా తెలిసిపోయిందని, అందుకే ఇస్తే తీసుకునే అలవాటు కాస్తా డబ్బుల కోసం డిమాండ్లు చేసే వరకూ పరిస్థితులు దిగజారాయని అంటున్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రం బిజెపి నేతలు అప్పనంగా వచ్చిన 18 వేల కోట్ల రూపాయల కాంట్రాక్టుతో వచ్చిన నిధులనే పంచుతున్నాడనే విషయం సామాన్య ప్రజలకు కూడా తెలిసిపోవడంతోనే ఇలా ధర్నాలు జరిగాయని పరిశీలకులు అంటున్నారు. అదే కోవలో కాంగ్రెస్, టి.ఆర్.ఎస్.పార్టీలకు చెందిన అభ్యర్థులు ప్రలోభాలు పెట్టలేదని, అందుకే ఆ రెండు పార్టీల నాయకులను డబ్బుల కోసం, బంగారం, ఇతర బహుమతుల కోసం ఎలాంటి ఆందోళనలు చేయలేదని, ధర్నాలు చేయలేదని వివరించారు. బిజెపి నాయకులు పది రోజుల క్రితమే డబ్బులు, బంగారం ఇస్తామని చాలా స్పష్టంగా హామీలు గుప్పించారని, ఓట్లు కమలం గుర్తుకే ఓట్లు వేయాలని తమతో ప్రమాణాలు కూడా చేయించారని, తీరా సమయం దగ్గరపడినా కూడా బిజెపి వాళ్ళు ఇస్తామన్న డబ్బులు ఇవ్వలేదు, పది గ్రాముల బంగారం కూడా ఇవ్వలేదని, అందుకే తమ గ్రామంలోని బిజేపి నాయకుణ్ణి నిలదీశామని ధరాలు చేసిన ఓటర్లు బాహాటంగానే చెబుతున్నారు.

అంతేగాక అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తప్పకుండా స్థానిక నాయకులకు డబ్బులు ఇచ్చే ఉంటాడని, కానీ తమ గ్రామంలో ఉన్న నాయకులు స్వాహా చేసి తమకు ఇవ్వకుండా ఎగొట్టి ఉండవచ్చునని కూడా ఆయా గ్రామాల్లోని ఓటర్లు స్థానిక బిజెపి నాయకులను నిలదీశారని తెలుస్తోంది. ఇలా ఓటర్లను ప్రలోభాలకు గురిచేసి ఎన్నికల్లో గెలవాలని బిజెపి నాయకులు చేసిన ప్రయత్నాలు ఇప్పుడు బహిర్గతమై సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇలా రాజకీయాలనే కాకుండా ప్రజాస్వామ్య విలువలను మంటగలిపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సిద్ధాంతాలను గాలికి వదిలిపెట్టి డబ్బునే నమ్ముకొని కమలం పార్టీ రాజకీయాలు చేస్తోందనే విమర్శలకు ఇలాంటి ఘటనలు బలం చేకూరుస్తున్నాయి. పోలింగ్ రోజున మునుగోడు ఓటర్లు ఎవ్వరికి ఓట్లు వేస్తారో ఈ నెల 6వ తేదీన జరుగనున్న ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడిలో తేలిపోనుంది.

ఇవి కూడా చదవండి..

కొరివితో తలగోక్కున్న బిజెపి

బండికి అధిష్టానం అక్షింతలు..

మునుగోడు బిజెపికి ప్రతిష్టాత్మకమే

- Advertisement -