సన్ రైజర్స్‌పై ముంబై గ్రాండ్ విక్టరీ..

240
Mumbai sail home on dewy evening
- Advertisement -

ఓటమితో టోర్నీని ఆరంభించిన ముంబయి ఇండియన్స్‌ జోరు పెంచింది. సొంతగడ్డ వాంఖడేలో అదరగొట్టింది. ఆల్‌రౌండ్‌ సత్తా చాటిన ముంబయి టోర్నీలో వరుసగా రెండో విజయం సాధించింది. బంతితో బుమ్రా.. బ్యాటుతో కృనాల్‌, రాణా, పార్థివ్‌ చెలరేగిన వేళ సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు టోర్నీలో తొలి ఓటమిని రుచి చూపించింది.

159 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన ముంబై… 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ బట్లర్‌ (14)ను నాలుగో ఓవర్లోనే ఔట్‌ చేయడం ద్వారా ముంబయిని నెహ్రా దెబ్బతీశాడు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మ (4) కూడా ఎక్కువసేపు నిలువలేదు.  ఐతే ధాటిగా బ్యాటింగ్‌ చేసిన మరో ఓపెనర్‌ పార్థివ్‌ పటేల్‌.. బౌండరీల మోత మోగిస్తూ జట్టును లక్ష్యం దిశగా నడిపించాడు. నితీశ్‌ రాణా (45; 36 బంతుల్లో 3×4, 2×6), కృనాల్‌ పాండ్య (37; 20 బంతుల్లో 3×4, 3×6), పార్థివ్‌ పటేల్‌ (39; 24 బంతుల్లో 7×4) చెలరేగడంతో లక్ష్యాన్ని ముంబయి 18.4 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ 3 వికెట్లు, ఆశీష్, రషీద్, దీపక్ హుడా చెరో వికెట్ తీసుకున్నారు.

అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ను ముంబయి బౌలర్లు కట్టడి చేశారు. సన్‌రైజర్స్‌ ఇన్నింగ్స్‌ గొప్పగా ఏమీ ఆరంభం కాలేదు. తొలి ఆరు ఓవర్లు ముగిసే సరికి వార్నర్‌ 21 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులతో ఉండగా.. 15 బంతులాడిన ధావన్‌ ఏడు పరుగులే సాధించాడు. అందులో ఒక్క బౌండరీ కూడా లేదు. ఐతే పవర్‌ప్లే తర్వాత వేగం పెరిగింది.

ఓపెనర్లు డేవిడ్ వార్నర్ (49), శిఖర్ ధావన్ (48) బాగానే ఆడినా… కీలక సమయంలో వికెట్లు కోల్పోవడంతో… స్కోర్ నెమ్మదించింది. యువరాజ్ సింగ్ (5) ,బెన్ కటింగ్ (20: 10 బంతుల్లో 4×4) స్కోరు పెంచే ప్రయత్నం చేసినా.. బుమ్రా అతణ్ని పెవిలియన్‌కి పంపి సన్‌రైజర్స్ కష్టాలను రెట్టింపు చేశాడు. చివర్లో విజయ్ శంకర్ (1), నమన్ ఓజా (9) వరుసగా ఔటవడంతో హైదరాబాద్ 158 పరుగులతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

- Advertisement -