Congress:కొత్త ఎన్నికలు.. కొత్త మేనిఫెస్టో?

31
- Advertisement -

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్ మేనిఫెస్టో ఎంతటి చర్చనీయాంశం అయిందో అందరం చూశాం. ఆరు హామీలు ఆరు గ్యారెంటీలు అంటూ హస్తం నేతలు చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. ఆ హామీల ప్రకటనతోనే హస్తం పార్టీ అధికారంలోకి వచ్చింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ప్రస్తుతం వాటి అమలుకై కాంగ్రెస్ ప్రభుత్వం మల్లగుల్లాలు పడుతున్న సంగతి తెలిసిందే. కానీ ఇంతలోనే మరిన్ని హామీలు ప్రకటించేందుకు హస్తం నేతలు సిద్దమౌతున్నట్లు తెలుస్తోంది. మరో రెండు నెలల్లో లోక్ సభ ఎన్నికలు జరగనుండగా.. ఈ ఎన్నికల్లో కూడా సత్తా చాటేందుకు మరో మేనిఫెస్టో రెడీ చేసేందుకు హస్తం హైకమాండ్ ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే గాంధీ భవన్ లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశం కానున్నట్లు టాక్. ఈ సమావేశంలో ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలే లక్ష్యంగా మేనిఫెస్టో రూపకల్పనపై చర్చించనున్నట్టు సమాచారం.

అసెంబ్లీ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీ హామీల మాదిరి లోక్ సభ ఎన్నికల్లో కూడా మరో ఆరు కీలక హామీలు ప్రకటించి ఓట్లు దండుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నాట్లు టాక్. గత లోక్ సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గాను కాంగ్రెస్ కేవలం రెండు సీట్లు మాత్రమే గెలుచుకుంది. దాంతో సారి ఎలాగైనా 10కి పైగా సీట్లు సొంతం చేసుకోవాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. అందులో భాగంగానే మేనిఫెస్టో రూపకల్పన చేయనున్నారట. అయితే వంద రోజుల్లో ఆరు గ్యారెంటీ హామీలను అమలు చేస్తామని చెబుతున్న కాంగ్రెస్ సర్కార్.. నిజంగానే అమలు చేయగలదా ? అంటే సందేహమే. ఈ నేపథ్యంలో మరిన్ని హామీలు ప్రకటించి వాటి అమలు కూడా హోల్డ్ లోకి వెళ్లిపోవడం ఖాయమనే వాదన కూడా వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రకటించే కొత్త హామీలను ప్రజలు ఎంతవరకు నమ్ముతారనేది ప్రశ్నార్థకమే.

Also Read:చంద్రబాబు బ్యాడ్ లక్..నో చెప్పిన పీకే!

- Advertisement -