ఇంటర్ ఫలితాల్లో నెలకొన్న గందరగోళం,విద్యార్థుల ఆత్మహత్యలపై స్పందించారు సినీ నటుడు,శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల అధినేత మోహన్ బాబు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం తనని కలచివేసిందన్నారు. భగవంతుడు జన్మనిచ్చింది తుది శ్వాస వరకు జీవించడానికేనని ఆవేశంలో నిర్ణయాలు తీసుకుని తల్లిదండ్రులను శిక్షించొద్దని కోరారు.
ఇంటర్ పలితాల గందరగోళంపై ప్రభుత్వం స్పందించిందన్నారు. తప్పు చేసిన వారిని శిక్షిస్తుంది. ఈలోగా తొందరపాటు నిర్ణయాలు తీసుకుని, మీరే సర్వస్వంగా జీవిస్తున్న తల్లిదండ్రుల హృదయాలను శిక్షించకండన్నారు.
మార్కులు రాలేదనో, పరీక్షలో తప్పామనో జీవితాన్ని ముగించుకుంటే తల్లిదండ్రులు, స్నేహితులు, సన్నిహితులు, బంధువులు తల్లడిల్లిపోతారని మోహన్ బాబు వెల్లడించారు. తల్లిదండ్రులు ఎప్పుడూ మీ ఉన్నతినే కోరుకుంటారు. వారి కోసం, వారి సంతోషం కోసం కళకళలాడుతూ వారి కళ్లముందు ఎదిగి చూపిస్తామని నిర్ణయం తీసుకోండని పేర్కొన్నారు.