కొత్త వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా రైతన్నలు ఆందోళనలు చేస్తుంటే పట్టించుకోని మోదీ సర్కార్ మరో కుట్రకు తెరతీసింది. కొత్త విద్యుత్ చట్టం తీసుకువచ్చి మన రైతన్నల పొలాల్లో బాయికాడ మీటర్లు పెట్టేందుకు కేంద్రం సిద్దమవుతోంది. అయితే బాయి కాడ మోటార్లను బిగించేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న కుట్రలను టీఆర్ఎస్ ప్రభుత్వం తిప్పికొట్టింది. రైతన్నల బాయికాడ మీటర్లను పెడితే ఒప్పుకునేది లేదని కేంద్రానికి తేల్చి చెప్పింది. విద్యుత్ సంస్కరణలలో భాగంగా కేంద్రంలోని మోదీ సర్కార్ నూతన విద్యుత్ చట్టాన్ని తీసుకువస్తున్న సంగతి తెలిసిందే.
ఈ చట్టం అమలు కోసం రూపొందించిన ముసాయిదా బిల్లును కేంద్రం ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు పంపింది. దాదాపు ఇరవై రాష్ట్రాలు ఉచిత వ్యవసాయ విద్యుత్‌ను ఎత్తివేస్తూ మీటర్లు పెట్టే విధానాన్ని వ్యతిరేకించాయి. తెలంగాణ అసెంబ్లీ కూడా గత సెప్టెంబరు 15న విద్యుత్ బిల్లును వ్యతిరేకిస్తూ ఏకగ్రీవ తీర్మానం చేసింది. సీఎం కేసీఆర్ స్వయంగా తీర్మానాన్ని శాసన సభలో ప్రవేశపెట్టి కొత్త విద్యుత్ బిల్లు ప్రకారం బాయికాడ మీటర్లను బిగించేందుకు తెలంగాణ రాష్ట్రం సిద్ధంగా లేదని, సాగుకు 24 గంటల విద్యుత్తు అందిస్తున్న వేళ… ఇది రైతుల ప్రయోజనాలకు విరుద్ధమైనదని, రాష్ట్రాల హక్కులను కాలరాస్తుందని మండిపడ్డారు. బిల్లును ఉపసంహరించుకోవాల్సిందిగా ప్రధానికి సీఎం కేసీఆర్ లేఖ కూడా రాశారు. కాని నిరంకుశ మోదీ సర్కార్ మాత్రం ప్రస్తుత బడ్జెట్ సమావేశాల్లోనే ఈ బిల్లును ఆమోదించుకుని చట్టాన్ని చేయాలన్న పట్టుదలతోనే ముందుకెళ్తోంది. తాజాగా ఢిల్లీ నుంచి కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్‌కే సింగ్, కార్యదర్శి అలోక్ కుమార్ బుధవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌కు తెలంగాణ ట్రాన్స్‌కో-జెన్‌కో సీఎండీ, పలువురు అధికారులు హాజరయ్యారు.
కొత్త విద్యుత్ బిల్లులో పేర్కొన్న అంశాలను ప్రస్తావించిన కేంద్ర విద్యుత్ మంత్రి ఆర్‌కే సింగ్ పంపుసెట్లకు మీటర్ల బిగింపు, డిస్కంలకు ఫ్రాంచైజీలు నెలకొల్పడం, ఈఆర్‌సీలను ను కేంద్రమే నియమించడం, రాష్ట్రాల జెన్‌కోలు ఉత్పత్తి చేస్తున్న విద్యుత్‌లో 19 శాతం ఉన్న సంప్రదాయేతర విద్యుత్తు ఉత్పత్తిని క్రమంగా పెంచడం వంటి ఆరు అంశాలను ప్రస్తావించారు. కేంద్ర మంత్రి ప్రతిపాదించిన వాటిలో పంపుసెట్లకు మీటర్లు బిగించడం, డిస్కంలకు ఫ్రాంచైజీలను నెలకొల్పడం, ఈఆర్‌సీల ఏర్పాటు కేంద్రం పరిధిలోకి వెళ్లడం అనే మూడు అంశాలను తీవ్రంగా వ్యతిరేకిస్తూ, వాటికి అనుమతించేదే లేదని తెలంగాణ స్పష్టం చేసింది. కొత్త బిల్లు విషయమై గతంలోనే అసెంబ్లీ చేసిన ఏకగ్రీవ తీర్మానాన్ని, సీఎం కేసీఆర్ రాసిన లేఖను ఈ సందర్భంగా సీఎండీ ప్రస్తావించినట్టు సమాచారం. ఇప్పటికే కేంద్ర వ్యవసాయ నల్ల చట్టాలతో వ్యవసాయ రంగాన్ని రాష్ట్రాల పరిధిలోంచి కేంద్రం పరిధిలోకి లాక్కోవాలని ప్రయత్నిస్తున్న మోదీ సర్కార్ కొత్త విద్యుత్ చట్టం పేరుతో రాష్ట్రాల పరిధిలోని విద్యుత్ రంగాన్ని తన చెప్పు చేతుల్లోకి తీసుకునేందుకు కుట్ర చేస్తోంది. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టి రైతన్నలను కేంద్రం ఇంతలా దగా చేస్తుంటే బండి సంజయ్, అర్వింద్ వంటి బీజేపీ నేతలు నోరెత్తడం లేదు. బాయికాడ మీటర్లు బిగించేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేస్తున్న కుట్రలపై రైతన్నలంతా ఏకమై తిరగబడాలి. కేవలం అధికారం కోసం మత విద్వేషాలు రగిలించడమే తప్పా..రైతన్నల కోసం నోరెత్తని బండి సంజయ్, అర్వింద్ వంటి తెలంగాణ బీజేపీ నేతలకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది.