కేసీఆర్ స్కీమ్‌తో బీజేపీకి షాక్ ఇవ్వబోతున్న మమతా..!

58
mamatha

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పథకాలు కేంద్రంతో సహా దాదాపుగా అన్ని రాష్ట్రాలకు ఆదర్శప్రాయంగా నిలుస్తున్నాయి. రైతుబంధు, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కల్యాణలక్ష్మీ వంటి పథకాలను కేంద్రంలోని మోదీ సర్కార్ కాపీ కొట్టి కొత్తగా పథకాలు తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తెలంగాణలో సీఎం కేసీఆర్‌కు అత్యంత ఇష్టమైన 5 రూపాయల అన్నపూర్ణ భోజన పథకాన్ని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఫాలో అవుతున్నారు. మన భాగ్యనగరంలో విశేష ఆదరణ పొందిన ఈ 5 రూపాయల భోజన పథకాన్ని మమతా దీది బెంగాల్‌లో ప్రారంభించారు. త్వరలో పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి.

ఈసారి బెంగాల్‌గడ్డపై ఎలాగైనా కాషాయ జెండా ఎగరవేయాలని మోదీ, అమిత్‌షాలు గట్టిపట్టుదలతో ఉన్నారు. అందుకే వరుసగా టీఎంసీ ప్రభుత్వంలోని మంత్రులను, ఎమ్మెల్యేలను తమ పార్టీలోకి లాగుతూ మమతకు షాక్ ఇస్తున్నారు. అయితే బీజేపీ ఎన్ని కుట్రలు చేసినా ముచ్చటగా మూడోసారి నాదే అధికారం అంటున్నారు మమతాదీదీ. ఎన్నికలు దగ్గర పడుతుండడంతో బెంగాల్ ప్రజలను ఆకట్టుకునేందుకు పలు ప్రజాకర్షక పథకాలకు శ్రీకారం చుడుతున్నారు. ఈ క్రమంలో పేదలకు, అన్నార్తుల ఆకలి తీర్చేందుకు తెలంగాణ తరహాలో రూ.5 భోజన పథకాన్ని మమతా దీదీ ప్రారంభించారు.

ఆ పథకానికి “మా క్యాంటీన్” అని పేరు పెట్టారు. అంటే అమ్మ క్యాంటీన్లు అన్నమాట. పేదలకు రూ.5కే అందించే భోజనంలో అన్నం, పప్పు, కూరగాయలు, గుడ్డు కూరను మమతా ప్రభుత్వం అందించనుంది. త్వరలోనే బెంగాల్‌లోని పట్టణ ప్రాంతాల్లో ఈ క్యాంటీన్లు ప్రారంభం కానున్నాయి. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు అవి పని చేస్తాయి. ఈ కొత్త పథకం కోసం మమతాదీదీ బడ్జెట్లో రూ.100 కోట్లను కేటాయించారు. అర్బన్ డెవలప్‌మెంట్, మున్సిపల్ శాఖల సహకారంతో స్వయం సహాయక బృందాలు మా క్యాంటీన్లను నిర్వహిస్తాయి. తెలంగాణ సీఎం కేసీఆర్ స్కీమ్‌తో బెంగాల్‌లో బీజేపీకి చెక్ పెట్టేందుకు మమతాబెనర్జీ చేస్తున్న ఈ ప్రయత్నాలు కమలనాథులను కలవరపెడుతున్నాయి. మొత్తంగా తెలంగాణ తరహాలో పశ్చిమబెంగాల్‌లో రూ. 5 భోజన పథకం స్టార్ట్ కావడం విశేషమనే చెప్పాలి.