కెసిఆర్ విడుదల చేసిన కుట్ర సినిమా ప్రభావంతో బిజెపిలో అలజడి
అపరేషన్ ఆకర్ష్ విఫలంతో పార్టీ పరువు గంగలో కలిసిందని కార్యకర్తల్లో ఆందోళన
పార్టీని కాపాడుకునేందుకు లాజిట్లు చెబుతున్న నేతలు
నేతల వైఖరి నచ్చక పార్టీని వీడుతన్న కీలక నేతలు
ఇప్పటికే వేలాదిగా బయటకు వెళ్ళిపోయిన కార్యకర్తలు
టీఆర్ఎస్ ఎంఎల్ ఎల కొనుగోలు వ్యవహారంలో ఢిల్లీ పెద్దల పేర్లు బహిర్గతమవడంతో రాష్ట్ర బిజెపిలో కల్లోలం చెలరేగింది. నిన్నమొన్నటి వరకు ఈ వ్యవహారంతో తమకు సంబంధమే లేదని బింకాలు పలికిన రాష్ట్ర నేతలు ప్రస్తుతం ఇదే అంశంపై బీరాలు పలుకుతుండటం గమనార్హం. ఇంత బాహాటంగా ఆపరేషన్ ఆకర్ష్ విఫలం కావడం రాష్ట్రస్థాయి బిజెపి నేతలకు మింగుడుపడని అంశంగా పరిణమించిందని పార్టీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. ఈ అంశంపై రాష్ట్ర బిజెపి సరైన రీతిలో స్పందించడం లేదని బిజెపి ఢిల్లీ పెద్దలు రాష్ట్ర నేతలపై ఆగ్రహావేశాలు వ్యక్తపరిచినట్లు తెలుస్తోంది. దీంతో రాష్ట్ర నాయకత్వం అప్రమత్తమైంది. ఢిల్లీలో కిషన్ రెడ్డి , రాష్ట్రంలో బండి సంజయ్ హడావుడిగా విలేఖరుల సమావేశాలు నిర్వహించి కొనుగోలు వ్యవహారంలో తమకేమీ సంబంధం లేదని వివరణ ఇచ్చుకోవల్సిన అగత్యం ఏర్పడిందని చెబుతున్నారు. మరోవైపు దీనిపై ముఖ్యమంత్రి కెసిఆర్ విడుదల చేసిన కుట్ర సినిమా ప్రభావం తెలంగాణ బిజెపిలో అలజడి సృష్టించింది. పటిష్టమైన సిద్ధాంతాలు , క్రమశిక్షణకు మారుపేరైన బిజెపి పరువుప్రతిష్టలు గంగలో కలిశాయని కిందిస్థాయి కార్యకర్తల నుంచి సీనియర్ నాయకుల వరకు తీవ్రస్థాయిలో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వాజ్ పేయి ప్రధానిగా ఉన్న సమయంలో ఎంతో నిబద్ధతతో వ్యవహరించిన బిజెపి నేడు స్వామీజీలు, బ్రోకర్లను అడ్డం పెట్టుకుని ప్రజాప్రతినిధులను కొనడం, రాష్ట్ర ప్రభుత్వాలను కూల్చే స్థాయికి దిగజారడం పై పలువురు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎనిమిది రాష్ట్రాలలోని ప్రభుత్వాలను బిజెపి కూల్చివేసిన విషయం తెలిసిందే. తెలంగాణలో ఆపరేషన్ ఆకర్ష్ విఫలమవడంతో ఢిల్లీ నాయకత్వం బిజెపి చీఫ్ బండి సంజయ్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలకు గట్టిగా మొట్టికాయలు వేసినట్లు సమాచారం. ఈ వ్యహారంతో ఢిపెన్స్ లో పడిన పార్టీని కాపాడుకోవడం కోసం వారిద్దరూ సోది లాజిట్లు చెబుతూ విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వాలను కూలగొట్టడానికి, ఎంఎల్ ఎలను కొనుగోలు చేయడానికి స్వామీజీలు, బ్రోకర్లు అవసరం లేదంటూ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారు. వేల కోట్లతో ఎంఎల్ ఎలను కొనాల్సిన ఖర్మ తమకు లేదని, నిర్ణీత గడువులోనే ఎన్నికలకు సమాయత్తమవుతున్న తరుణంలో ఎందుకు కొంటామని బిజెపి నేతలు పైకి చెబుతున్నప్పటికీ వెనుక నుంచి తంతు నడుపుతున్నారని ఆ పార్టీలో చర్చించుకుంటున్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బిజెపి అసలు సిద్ధాంతం పక్కకు పోయి ఏదేదో జరుగుతుందంటూ సీనియర్లు వాపోతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కొనక తప్పదని సీనియర్లు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీలో సీనియర్లను లెక్కచేయకుండా దూకుడుగా వ్యవహరిస్తున్న బండి సంజయ్ తనకు తోచిన విధంగా కార్యక్రమాలు చేపడుతున్నట్లు ముద్రపడింది. ఈ క్రమంలో అసంతృప్తితో కొందరు సీనియర్లు పార్టీ కార్యక్రమాలకు దూరమవుతున్నారు. అదే దారిలో బిజెపి అనుబంధ మోర్చా (విభాగాలు) నాయకులు పార్టీ రాష్ట్ర కమిటీని సంప్రదించకుండా సొంతంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ విషయమై సీనియర్లు ఆయా మోర్చాల అధ్యక్షులను సున్నితంగా మందలించినప్పటికీ మార్పు కనిపించడం లేదని పార్టీ నాయకులు చెబుతున్నారు. నెల రోజులుగా బిజెపిని విడిచిపెట్టి పోతున్న నాయకులు ఎక్కువయ్యారు. వారిలో బిసి వర్గాలకు చెందిన నేతలు ఉండటం గమనార్హం. బిజెపిలోకి ఒకరు చేరితే ఇద్దరు పార్టీని వదిలిపెట్టి బయటకు వెళ్ళిపోతున్నారు. ఈ నేపథ్యంలో పార్టీలోని కొందరు సీనియర్లు అసంతృప్తితో బయటకు వెళ్లిపోతుంటే మీరేమి చేస్తున్నారని ఢిల్లీ నాయకత్వం బండి, కిషన్ రెడ్డిలను పిలిచి చివాట్లు పెట్టినట్లు తెలిసింది. మునుగోడు ఎన్నికల సందర్భంగా వందలాది మంది పార్టీని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. పార్టీ లోకి వరసుగా నేతలను తీసుకొస్తారని ఎంఎఱ ఈటల రాజేందర్ ఛైర్మన్ గా చేర్పుల కమిటీని వేస్తే ఫలితం లేకుండా పోయిందని అధిష్టానం గుర్రుగా ఉంది. ప్రధానంగా పార్టీ నుంచి కీలకమైన బీసీ నేతలు బయటకు వెళ్ళిపోయారు. బీసీ వ్యతిరేక పార్టీగా ముద్రపడవద్దని అధిష్టానం రాష్ట్ర నేతలకు సూచించినప్పటికీ పార్టీని విడిచిపెట్టే వారు పెరుగుతున్నారు. ఇప్పటికే మునుగోడులో బిజెపి రెండవస్థానంలో ఉంటుందని పలు సర్వేలు ప్రకటించిన నేపథ్యంలో అధిష్టానం రాష్ట్ర నేతలకు మందలించినట్లు సమాచారం. పార్టీ ఓటమి పాలైతే పార్టీలో భారీగా ప్రక్షళనలు ఉంటాయని ఢిల్లీ నాయకత్వం హెచ్చరించినట్లు తెలిసింది.
ఇవి కూడా చదవండి..