సాయితేజ్ హీరోగా దేవ్ కట్టా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రిపబ్లిక్’. జీ స్టూడియోస్ సమర్పణలో జె.బి.ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై జె. భగవాన్, జె. పుల్లారావు ఈ చిత్రాన్ని నిర్మించారు. పొలిటికల్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌గా రూపొందిన ఈ సినిమా అక్టోబర్ 1న విడుదలై సూపర్‌హిట్ టాక్‌తో మంచి కలెక్షన్స్ సాధిస్తోంది. అలాగే ఈ సినిమాకు సినీ, రాజకీయ వర్గాలనుండి విశేష స్పందన లభిస్తోంది.తాజాగా రిపబ్లిక్ సినిమాను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, సింగర్ స్మిత వీక్షించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సీతక్క మాట్లాడుతూ.. ‘సినిమాకు రావడం ఇదే ఫస్ట్ టైం. ఈ సినిమా చూసిన తరువాత గుండె బరువెక్కింది. నాకు ఓ చరిత్ర, ఘటన గుర్తుకు వస్తుంది. బ్రిటీష్ పరిపాలనకు వ్యతిరేకంగా పోరాడిన గాంధీజీని.. ఓ గాడ్సే రూపంలో చంపేస్తే.. అలానే ఓ అధికారి ప్రజల బాధలను తొలగిస్తే.. వారే మళ్లీ తిరిగి అధికారిని చంపడం వంటి ఘటనలు ఇప్పటికీ జరుగుతున్నాయి. ప్రతీ ఒక్కరూ ఈ సినిమా చూడాలి. రాజకీయాల్లో మార్పు రావాలి. ప్రజల్లోనూ మార్పులు రావాలి. ప్రతీ ఒక్కరిలో మార్పులు వస్తే మంచి ప్రజాస్వామ్యాన్ని నిర్మించుకోగలం. ప్రజలు, మాలాంటి పదవుల్లో ఉన్న వ్యక్తులు కూడా సినిమాను చూసి మార్పును కోరుకోవాలి’అని అన్నారు.