హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిస్తే.. ఆ నియోజకవర్గ అభివృద్ధికి రూ. 100 కోట్లు ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారు.. అదేమైందని బీజేపీ రాష్ర్ట అధ్యక్షుడు బండి సంజయ్ వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా సంజయ్ వ్యాఖ్యలపై హుజుర్‌నగర్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి స్పందించారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత.. సీఎం కేసీఆర్ చొరవతో నియోజకవర్గం తలరాత మారిందని సైదిరెడ్డి స్పష్టం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలపై ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్ విసిరారు.
హుజుర్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధిపై చర్చకు సిద్ధమా? అని బండి సంజయ్‌కు ఎమ్మెల్యే సైదిరెడ్డి సవాల్ చేశారు. హైదరాబాద్ సోమాజిగూడలోని ప్రెస్‌క్లబ్‌లో బుధవారం చర్చకు సిద్ధం అని సైదిరెడ్డి స్పష్టం చేశారు. దమ్ముంటే బండి సంజయ్ అక్కడికి రావాలని ఎమ్మెల్యే సవాల్ చేశారు. ఓటు బ్యాంకు రాజకీయాలు తప్ప అభివృద్ధి గురించి పట్టించుకోలేదు. ఏడాది గడవక ముందే నియోజకవర్గం అద్భుతంగా పురోగమించిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. రూ. 100 కోట్ల కంటే ఎక్కువగానే సీఎం కేసీఆర్ నిధులిచ్చి.. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారని ఎమ్మెల్యే తెలిపారు.
హుజుర్‌నగర్ మున్సిపాలిటీకి రూ. 25 కోట్లు, నేరేడుచర్ల మున్సిపాలిటీకి రూ. 15 కోట్లతో పాటు ప్రతి గ్రామపంచాయతీకి రూ. 20 లక్షలు కేటాయించారని తెలిపారు. మండల కేంద్రానికి రూ. 30 లక్షలు, గుర్రంగోడు, చింత్రియాల, ఎల్లగూరు, నక్కగూడెం లిఫ్ట్‌లకు రూ. 25 కోట్లు కేటాయించారు. చెక్‌డ్యామ్‌ల కోసం రూ. 27 కోట్లు కేటాయించారని తెలిపారు. రూ. 33 కోట్లతో మిషన్ భగీరథ పనులు చేపట్టామని పేర్కొన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రికి నోటిఫికేషన్ ఇచ్చారు.. దీని నిర్మాణానికి 5 ఎకరాల భూమి కూడా కేటాయించామన్నారు. అలాగే ఐటీఐ కాలేజీని మఠంపల్లి మండల కేంద్రంలో ప్రారంభించామని తెలిపారు. పాలిటెక్నిక్ కాలేజీకి నోటిఫికేషన్‌ను ఇచ్చారు.. పోస్టులు కూడా మంజూరు అయ్యాయని స్పష్టం చేశారు.
హుజుర్‌నగర్‌లో టీఆర్ఎస్ పార్టీ గెలిచిన తర్వాత ఆర్డీవో ఆఫీసును ప్రభుత్వం ఏర్పాటు చేసింది. మేళ్ల చెరువు మండలంలో గిరిజన సంక్షేమ కళాశాలను ఏర్పాటు చేశాం. రూ. కోటిన్నరతో బంజారా భవన్‌ను నిర్మించుకుంటున్నామని ఎమ్మెల్యే తెలిపారు. ఉప ఎన్నిక సందర్భంగా విడుదల చేసిన మేనిఫెస్టోలోని అంశాలన్నింటినీ అమలు చేశాం. ఇప్పటికే 80 నుంచి 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ ప్రజల కోసం పని చేస్తుందన్నారు. బీజేపీలా దొంగ లెక్కలు, అబద్దాలు చెప్పే పార్టీ తమది కాదన్నారు. హుజుర్‌నగర్ ఉప ఎన్నికలో బీజేపీకి కేవలం 2600 ఓట్లు మాత్రమే వచ్చాయి. దుబ్బాక ఉప ఎన్నికలో కూడా బీజేపీకి ఓటమి తప్పదని స్పష్టం చేశారు. దుబ్బాకలో టీఆర్‌ఎస్ పార్టీ భారీ మెజార్టీతో గెలుస్తుందని ఎమ్మెల్యే సైదిరెడ్డి పేర్కొన్నారు.