గంగ పుత్రులను బాధ పెట్టే విధంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని తెలిపారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. కరీంనగర్ ఎల్‌ఎండీ గెస్ట్ హౌస్‌లో మంత్రి గంగుల కమలాకర్‌తో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడిన తలసాని.. రాష్ట్రంలో గంగ పుత్రుల హక్కులకు ఎలాంటి భంగం కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.కుల వృత్తులకు చేయూతనందించడం ద్వారా గ్రామీణ ఆర్ధిక వ్యవస్ధను బలోపేతం చేయాలనేది ప్రభుత్వ ఉద్దేశమని మంత్రి తె లిపారు.
గంగపుత్రుల ఆత్మగౌరవ భవన నిర్మాణానికి ఉప్పల్ భగాయత్‌లో 3 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించిందన్నారు. ముదిరాజ్ భవన్ శంకుస్థాపన కార్యక్రమంలో ముదిరాజ్‌లను ఉత్తేజ పరిచే విధంగా మాత్రమే మాట్లాడానని అన్నారు. మత్స్య కారుల అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ నాయకత్వంలో అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని వెల్లడించారు. అత్యధికంగా వెనుకబడిన వర్గాల ప్రజలు కుల వృత్తులపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.