నాగార్జునసాగర్ టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు సబ్బండ వర్గాల మద్దతు ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. భగత్ విద్యావంతుడని, ఆయన దివంగత ఎమ్మెల్యే నోముల నర్సింహయ్యకు చేదోడువాదోడుగా పనిచేశాడని గుర్తుచేశారు. నాగార్జునసాగర్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే కోనేరు కోనప్పతో కలిసి హాలియాలో మంత్రి మీడియాతో మాట్లారు. ఈ సందర్భంగా తలసాని మాట్లాడుతూ.. జానారెడ్డి ఏడుసార్లు మంత్రిగా పనిచేసినప్పటికీ సాగర్‌కు చేసిందేమీ లేదని విమర్శించారు. చెప్పుకునేది ఏమీలేకపోవడంతోనే ప్రచారం వద్దంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సాగర్ అభివృద్ధికి టీఆర్‌ఎస్ పార్టీ కట్టుబడి ఉందని చెప్పారు. ఇందులో భాగంగానే హాలియా మున్సిపాలిటీకి ప్రభుత్వం రూ.కోటి విడుదల చేసిందని వెల్లడించారు. నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు నీరివ్వాలని సీఎం కేసీఆర్ కొత్త లిఫ్టులను మంజూరు చేశారని తెలిపారు. అన్ని వర్గాల ఆదాయం పెంచడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తున్నదని పేర్కొన్నారు. పల్లెప్రగతితో గ్రామాలు అందంగా మారాయని మంత్రి వెల్లడించారు.
రైతుబీమా, రైతుబంధు పథకాలతో నేరుగా రైతుల ఖాతాల్లోనే నగదు జమచేస్తున్నామని చెప్పారు. కల్యాణలక్ష్మి ద్వారా ఆడబిడ్డల పెళ్లిళ్లకు రూ.లక్షా 116 ఇస్తున్నామని తెలిపారు. కరోనా కష్టకాలంలో కూడా ఒక సంక్షేమ పథకాన్ని ఆపలేదని చెప్పారు. పనిచేస్తున్న ప్రభుత్వానికి మద్దుతివ్వాలని, టీఆర్‌ఎస్ అభ్యర్థి భగత్ కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని మంత్రి తలసాని కోరారు.