పాత జిల్లాల ప్రతిపాదికన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించే విషయంలో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి పంపాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి పి. సబితా ఇంద్రారెడ్డి సంబంధిత అధికారులను సూచించారు. సోమవారం నాడు విద్యా శాఖ సమస్యలపై ఉపాధ్యాయ ఎమ్మెల్సీలతో తన కార్యాలయంలో సమావేశమయ్యారు. స్పౌజ్ కేసులకు సంబంధించి అంతర్ జిల్లా బదిలీలు నిర్వహించేందుకు వీలైనంత త్వరగా ప్రతిపాదనలు పంపాలని కోరారు. ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఇచ్చిన ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామని మంత్రి తెలిపారు.
ప్రస్తుతం 7వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు 8వ తరగతి నుంచి 10వ తరగతి వరకు అప్ గ్రేడ్ చేస్తూ అనుమతులు మంజూరు చేసే అధికారాలను జిల్లా విద్యా శాఖాధికారులకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి పేర్కొన్నారు. ఇలా చెయ్యడం వల్ల త్వరితగతిన అనుమతులు మంజూరయ్యే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి బి.జనార్ధన్ రెడ్డి, పాఠశాల విద్యా శాఖ కమిషనర్ విజయ్ కుమార్, శాసన మండలి సభ్యులు జనార్ధన్ రెడ్డి, నర్సిరెడ్డి,రఘోత్తం రెడ్డి , అధికారులు పాల్గొన్నారు.