సీఎం కేసీఆర్‌కు ధన్యవాదాలు తెలిపిన మంత్రి పువ్వాడ

147
kcr cm
- Advertisement -

కరోనా కారణంగా విధించిన లాక్ డౌన్ సమయంలో ఉద్యోగుల వేతనాల్లో విధించిన 50 శాతం కోత వేతలను తక్షణమే తిరిగి చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక శాఖకు ఆదేశాలిచ్చినట్లు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఏప్రిల్, మే రెండు నెలల వేతనాల్లో కోత విధించిన 50 శాతం తిరిగి చెల్లించేందుకు రూ.120 కోట్లు చెల్లించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతో తగిన బడ్జెట్‌ను విడుదల చేసేందుకు ఆదేశాలిచ్చారని మంత్రి వివరించారు. కోవిడ్ సమయంలో ప్రజల రవాణా ఇబ్బందులను నివారించేందుకు ఆర్టీసీ అందించిన సేవల పట్ల ముఖ్యమంత్రి సంతృప్తి వ్యక్తం చేస్తూ అభినందినట్లు చెప్పారు.

ఆదివారం మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో రవాణా శాఖ మంత్రితో కలిసి ఆర్టీసీ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షించారు.ఈ ఉన్నత స్థాయి సమావేశంలో ఆర్టీసీ సేవలు, ఉద్యోగుల సంక్షేమంపై చర్చించారు. కరోనా భయంతో కొంత వ్యక్తిగత వాహనాల వాడకం పెరిగిపోయిన కారణంగా కొన్ని నెలలుగా ఆర్టీసీలో ఆక్యేపెన్సీ రేషియో తగ్గిపోయిందని తద్వారా ఆర్టీసీ తిరిగి నష్టాల బాటపట్టిందని అధికారులు సమీక్షా సమావేశంలో సిఎం కెసిఆర్‌కు వివరించారు. ప్రజలు ఆర్టీసిని తిరిగి ఆదరించాలంటే ఎటువంటి విధానాలను అవలంభించాల్నో లోతుగా చర్చించండి.’’ అని సిఎం అధికారులను ఆదేశించారు.

కరోనా నేపథ్యంలో కుదేలైన టి.ఎస్. ఆర్టీసీని తిరిగి సాధారణ స్థితికి తీసుకురావాలని, ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో గాడిన పడుతూ లాభాల బాట పడుతున్న ఆర్టీసీకి కరోనా కష్టాలను తెచ్చిపెట్టిందని అయినా వెనకడుగువేయకుండా ఆర్టీసిని తిరిగి ఆదుకుంటామని సిఎం స్పష్టం చేసినట్లు చెప్పారన్నారు. హైదరాబాద్ లో సిటీ బస్సులను 50 శాతం నడుపుకోవడానికి సిఎం తగిన ఆదేశాలిచ్చారని మంత్రి వెల్లడించారు. హైద్రాబాద్ సిటీలో బస్సుల సంఖ్యను పెంచడం ద్వారా హైద్రాబాద్ కు జిల్లాల నుంచి వచ్చి పోయే ప్రయాణీకులకు రవాణా భరోసా దొరుకుదుందని, అందుకోసం హైద్రాబాద్‌లో బస్సు సర్వీసులను యాభై శాతానికి పెంచాలని సిఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

టి.ఎస్.ఆర్టీసీ అంటే తనకు ప్రత్యేక అభిమానమని, రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీకి ఎప్పుడూ అండగా ఉంటుందని, తగిన సహాయ, సహకారాలు అందిస్తూ అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చెప్పారన్నారు. అలాగే, ఆర్టీసీలో ఉద్యోగుల జాబ్ సెక్యూరటీ విషయంపై త్వరగా విధాన పరమైన నిర్ణయం తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి ఆదేశించారన్నారు. ఆర్టీసీ మీద ఉద్యోగులు సహా ఆధారపడిన కటుంబాలు పెద్ద సంఖ్యలో వున్నాయంటూ పేదలకు ఆర్టీసీ అత్యంత చౌకయిన రవాణా వ్యవస్థ కావటంతో ప్రభుత్వం లాభ నష్టాల గురించి ఆలోచించకుండా సంస్థను ఆర్థికంగా ఆదుకోవడం జరుగుతోందని సిఎం చెప్పారని మంత్రి పువ్వాడ తెలిపారు.

కరోనా కష్టాలను దాటుకుంటూ తగు నిర్ణయాలను తీసుకోవాలని, ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ఆర్టీసీకి తిరిగి కోరోనా ముందటి పరిస్థితిని తీసుకురాగలమో అధికారులు విశ్లేషించుకోవాలని సిఎం ఆదేశించారన్నారు. సంస్థలో టిక్కెటేతర ఆదాయాన్ని పెంచుకునే దిశలో కార్యాచరణ దిశగా అడుగులు వేయాలని, సరుకు రవాణా చేపట్టిన టి.ఎస్.ఆర్టీసీ కార్గో, పార్శిల్ సేవల పట్ల కూడా ముఖ్యమంత్రి అభినందించినట్లు మంత్రి తెలిపారు. తక్కువ కాలంలో వినియోగదారుల అభిమానాన్ని చూరగొంటుందంటూ కార్గో సేవలను ప్రారంభించిన అనతికాలంలోనే మిలియన్ పార్శిల్స్ ను చేరవేసి రికార్డును ఆర్టీసి సొంతం చేసుకోవడం పట్ల సిఎం ఆనందం వ్యక్తం చేసి తనతో పాటు సంస్థ అధికారులను అభినందించినట్లు మంత్రి చెప్పారు.

భవిష్యత్తులో రైల్వేలో మాదిరి, ఆర్టీసీ కూడా కార్గో సేవలతో లాభాలను గడిస్తుందని సిఎం ఆశాభావం వ్యక్తం చేశారన్నారు. సిఎం కెసిఆర్ ఆదేశాలతో ఇటీవల ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో జరిపిన చర్చల ఫలితంగా తెలంగాణ ఆర్టీసికి అధనంగా లక్షలాది కిలోమీటర్ల రవాణా హక్కు దక్కిందని ఈ సందర్భంగా సంస్థ అధికారులు, సిఎంకు ధన్యవాదాలు తెలిపారు.

- Advertisement -