కరోనా వైరస్ ను అరికట్టడానికి స్వీయ నియంత్రణ తప్పని సరి అని, ఈ మేరకు జనతా కర్ఫూ సందర్భంగా తన కుటుంబ సభ్యులతో 24 గంటల పాటు ఇంట్లోనే గడుపుతున్నట్లు రవాణా శాఖా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. హైదరాబాద్‌లోని మినిస్టర్ క్వార్టర్స్ లోని నివాసంలో సతీమణి పువ్వాడ వసంతలక్ష్మి, తనయుడు డాక్టర్ పువ్వాడ నయన్‌తో కలిసి ఇంట్లోనే మంత్రి జనతా కర్ఫూను పాటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యమంత్రి శ్రీ కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రజలు 24 గంటల పాటు జనతా కర్ఫూను విజయవంతం చేయాలని కోరుతూ కరోనా వైరస్ ను నియంత్రించడానికి బహిరంగ ప్రదేశాలకు దూరంగా ఉండటంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటించాల్సి ఉందన్నారు. స్వీయ నియంత్రణ ద్వారా వైరస్ ప్రబలకుండా రక్షణ పొందవచ్చన్నారు.
ప్రభుత్వం సూచిస్తున్న నియమ నిబంధనలు, సూచనల్ని పాటించడమే కాక అధికార యంత్రాంగం తీసుకుంటున్న చర్యల్లో భాగంగా ఎవరి జాగ్రత్తల్లో వారు ఉండాలని ఆయన సూచించారు. కరోనా గుప్పిట బారిన పడకుండా ఉండేందుకై ప్రభుత్వం అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టిందని చెప్పారు. ఖమ్మం జిల్లాలోనూ ప్రజలు జనతా కర్ఫూను విజయవంతం చేయడానికి ప్రయత్నిస్తున్నారని తెలిపారు.
ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధుల విషయంలో సామాజిక, పరిసరాల పరిశుభ్రత ఎంత ప్రాధాన్యతను సంతరించుకుంటాయో అంతకు మించిన ఫలితం వ్యక్తిగత పరిశుభ్రత ద్వారా సాధించవచ్చన్నారు. విదేశాల నుంచి వచ్చిన వారు ఎవరైన ఉంటే వారి వివరాలను అధికార యంత్రాంగానికి తెలియ జేయాలని చెప్పారు.