మహబూబ్ నగర్ పట్టణంలోని దివిటిపల్లిలో నూతనంగా నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను మంత్రులు శ్రీనివాస్ గౌడ్, వేముల ప్రశాంత్ రెడ్డి కలిసి ప్రారంభించారు. డబుల్ బెడ్రూం ఇండ్లకు నీటి సరఫరాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి వేముల మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ జల దోపిడీని అడ్డుకొని తీరుతామని మంత్రి వేముల తేల్చిచెప్పారు. రాయలసీమ ప్రాజెక్టును ఏపీ కొనసాగిస్తే.. తెలంగాణ ప్రజలు మరో యుద్ధానికి సిద్ధం కావాలని మంత్రి పిలుపునిచ్చారు.
ఎలాంటి అనుమతులు లేకుండా వైస్ జగన్ రాయలసీమ ఎత్తిపోతల చేపట్టారు అని ధ్వజమెత్తారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి అక్రమంగా పోతిరెడ్డిపాడు నుండి 40 వేల క్యూసెక్కులు దోచుకుపోయారు. పోతిరెడ్డిపాడు జల దోపిడీపై టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు మంత్రులు రాజీనామా చేస్తే అప్పటి కాంగ్రెస్ మంత్రి డీకే అరుణ వైయస్ అక్రమంగా నీటిని తరలించుకుపోతున్నప్పుడు హారతులు పట్టారు అని మండిపడ్డారు.
ఎవరైనా ఆంధ్రవారు ఆంధ్రవారే అని కడిగిపారేశారు. వైఎస్ నీటి దొంగ అయితే ఆయన కొడుకు గజ దొంగ అని విమర్శించారు. దొంగతనంగా ప్రాజెక్టులు కడుతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ, ఆర్డీఎస్ కుడి కాల్వ పనులను వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ప్రజాయుద్ధం జరుగుతుందని హెచ్చరించారు. మీ హక్కు నీటిని మీరు తీసుకోండి.. మా హక్కు నీటిని తీసుకుంటే సహించేది లేదు. తెలంగాణకు అన్యాయం జరిగితే సీఎం కేసీఆర్ ఊరుకోరు అని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తేల్చిచెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ మన్నె శ్రీనివాస్ రెడ్డి, స్థానిక నాయకులు పాల్గొన్నారు. దివిటిపల్లిలో 1,024 డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించారు. లబ్దిదారులు సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటామని భావోద్వేగానికి లోనయ్యారు. కేసీఆర్ వల్లే తమ సొంతింటి కల నిజమైందని ఆనంద భాష్పాలు రాల్చారు.