మేకిన్ ఇండియా అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు మంత్రి నిరంజన్ రెడ్డి. తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడిన నిరంజన్ రెడ్డి..తెలంగాణకు ఇతర ఏ రాష్ట్రాలు దరిదాపుల్లో కూడా లేవని మంత్రి స్పష్టం చేశారు. తెలంగాణ ఏడేండ్ల సగటు ఆర్థిక వృద్ధిరేటు 11.7 శాతంగా ఉందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఇలాంటి పథకాలు లేవని స్పష్టం చేశారు.
రాష్ట్రానికి రావాల్సిన నిధులు, ప్రాజెక్టులు, విద్యాసంస్థలు, వర్సిటీల కోసం బండి సంజయ్ పాదయాత్ర చేస్తే బాగుంటుందని మంత్రి సూచించారు. కృష్ణా నదిలో వాటా ఇవ్వాలని యాత్ర చేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు ఏదైనా సాయం చేయాలని యాత్ర చేయాలి. రైతుబంధు, రైతుబీమా దేశ వ్యాప్తంగా అమలు చేయాలని యాత్ర చేయాలన్నారు.
తెలంగాణ వ్యతిరేకులు ఆది నుంచి కుట్రలు చేస్తున్నారని…తెలంగాణ పునర్నిర్మాణాన్ని తాము గురుతర బాధ్యతగా భావిస్తున్నామని తేల్చిచెప్పారు.విద్యుత్ వినియోగంలో తెలంగాణ నంబర్ వన్‌గా ఉందన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలు అమ్మడం ద్వారా రిజర్వేషన్లు అందక నష్టపోతున్నారని తెలిపారు.