మరోసారి మంచి మనసు చాటుకున్న మంత్రి కేటీఆర్..

45
- Advertisement -

మంత్రి కేటీఆర్ మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. పేదరికం వలన ఉన్నత విద్యను అందుకోలేకపోతున్న ఇద్దరు బాలికలకు ఆర్థిక సహాయం అందించారు. పెద్దపల్లి జిల్లా కమాన్ పూర్ మండలం రాజాపూర్ గ్రామానికి చెందిన అవునూరి అఖిల తండ్రి ప్రభాకర్ ఒక రైతు, తల్లి గృహిణి. అఖిల ఇంటర్మీడియట్ లో సుమారు 98 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఎంబీబీఎస్ లో సీటు సాధించింది. మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో సీటు దక్కించుకున్న అఖిలకి ఫీజులు చెల్లించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురైన విషయం మంత్రి కేటీఆర్ దృష్టికి వచ్చింది. ఆమె విద్యాభ్యాసానికి అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందిస్తానని హామీ ఇచ్చిన మంత్రి కేటీఆర్, ఈరోజు ఆమెకు అవసరమైన ఫీజుల నిమిత్తం ఆర్థిక సహాయం చేశారు. ప్రగతి భవన్‌లో మంత్రి కేటీఆర్‌ను అఖిల కుటుంబ సభ్యులు కలిశారు. ఈ సందర్భంగా మంత్రి వారి యోగక్షేమాలను, ఆర్థిక స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు.

భద్రాద్రి కొత్తగూడెంకు చెందిన స్పందన 95 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ పూర్తిచేసుకుని టిఆర్ఆర్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ కోర్సులో సీటు సాధించింది. స్పందన తల్లిదండ్రులు రోజువారి కూలి పనులు చేసుకుంటూ ఆమెను ఇప్పటిదాకా చదివించారు. కడు పేదరికాన్ని అనుభవిస్తున్న స్పందనకి మంత్రి కేటీఆర్ ఆర్థిక సాయం అందించేందుకు ముందుకు వచ్చి ఈ రోజు వారి కుటుంబాన్ని కలిసి ఆమె ఎంబీబీఎస్ కోర్సుకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించారు.

ఇరువురు విద్యార్థినులతో వారి కుటుంబాలతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ వారి వారి విద్యాభ్యాసంలోనూ ఇదే స్ఫూర్తితో, పట్టుదలతో విజయం సాధించాలన్నారు. విద్యారంగంలో ఏదైనా సాధించాలనుకుంటే తమకున్న పరిమితులు, పేదరికం, ఆర్థిక పరిస్థితి వంటివి అడ్డుకాదని ఇరువురు విద్యార్థినులు నిరూపించారని ఈ సందర్భంగా కేటీఆర్ అన్నారు. తమ ఎంబీబీఎస్ కల నెరవేరదన్న ఆందోళనతో ఉన్న తమకు, మంత్రి కేటీఆర్ పిలిచి ఆర్థిక సహాయం అందించడం పట్ల విద్యార్థినులు సంతోషం వ్యక్తం చేశారు. కేటీఆర్ అందించిన ఈ సహాయంతో తమ విద్యాభ్యాసం పూర్తి చేసుకొని సమాజానికి సేవ చేస్తామని తెలిపారు.

- Advertisement -