హైదరాబాద్‌కు తాగునీటిని సరఫరా చేయడం కోసం ఆ వ్యవస్థను సమూలంగా ఆధునికీకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా నాగార్జునసాగర్‌కు సమీపంలోని సుంకిశాల వద్ద రూ.1,453 కోట్లతో హైదరాబాద్ మెట్రోవాటర్ అండ్ సివరేజ్ సర్వీసెస్ బోర్డు ఆధ్వర్యంలో ఇన్ టేక్ వెల్‌ను నిర్మిస్తున్నారు. ఈరోజు దానికి మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, మహమూద్ అలీ, మల్లారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, వి. శ్రీనివాస్ గౌడ్, జగదీశ్ రెడ్డి, జల మండలి అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. హైదరాబాద్ మహానగరం తెలంగాణకు రాజధాని అయినప్పటికీ.. భారతదేశానికి ఒక అసెట్ అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. అలాంటి హైదరాబాద్ మహానగరాన్ని భవిష్యత్ తరాలకు బ్రహ్మాండమైన అసెట్‌గా అందించాలని, భవిష్యత్ భారతవాణికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా భాగ్యనగరంలో కార్యక్రమాలు చేయాలని, ఆ విధంగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ తమకు ఎప్పుడూ చెప్తుంటారని కేటీఆర్ వెల్లడించారు.
దేశంలో వేగంగా ఎదుగుతున్న మహానగరం ఏదంటే హైదరాబాద్ అని చెప్పొచ్చు. హైదరాబాద్ శరవేగంగా పెరుగుతున్నది, విస్తరిస్తున్నదని తెలిపారు. 15 సంవత్సరాల కాలంలో ఢిల్లీ తర్వాత హైదరాబాద్ రెండో అతిపెద్ద నగరంగా ఆవిర్భవిస్తుందంటే.. ఇది అతిశయోక్తి కాదు. నేను చెప్పేది ఏదో కల్పన కాదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఎందుకంటే మనం ఇప్పటికే ఎయిర్ ట్రాఫిక్‌లో నాలుగో స్థానానికి చేరుకున్నాం. ఢిల్లీ, ముంబై, బెంగళూరు తర్వాత మనమే ఉన్నాం. చెన్నై, కోల్‌కతాను దాటిపోయామని కేటీఆర్ పేర్కొన్నారు. మిగతా ఏ నగరాలకు లేని భౌగోళిక, పర్యావరణ అనుకూలతలు హైదరాబాద్‌కు ఉన్నాయి. నాలుగు వైపులా నగరం పెరుగుతోందని కేటీఆర్ స్పష్టం చేశారు.
హైదరాబాద్‌కు 2072 వరకు తాగు నీటికి కష్టాలుండవని చెప్పారు. వరుసగా ఏడేళ్ల పాటు కరవు వచ్చినా సమస్యలు రాకుండా చర్యలు తీసుకుంటున్నామన్నారు. భవిష్యత్‌లో హైదరాబాద్ 100 కిలోమీటర్ల మేర విస్తరించినా తాగునీటి సమస్యలు రావన్నారు. ఔటర్ రింగ్ రోడ్ వెలుపల ఉన్న ప్రాంతాలకు కూడా నీటిని సరఫరా చేస్తామన్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌కు తాగునీటి అవసరాలు 37 టీఎంసీలుగా ఉందని, మరో 34 టీఎంసీలు కావాల్సి వస్తుందని చెప్పారు. 2035 నాటికి 47 టీఎంసీలు, 2050 నాటికి 58 టీఎంసీలు, 2065 నాటికి 67, 2072 నాటికి 70.97 టీఎంసీల నీళ్లు అవసరమవుతాయన్నారు. సుంకిశాల ఇన్ టేక్ వెల్ తో రోజూ 16 టీఎంసీలు లిఫ్ట్ చేయడానికి ప్రాజెక్టు నిర్మిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది ఎండాకాలం నాటికి ప్రాజెక్టును పూర్తి చేస్తామన్నారు.
భారతదేశంలోని ఇతర మహానగరాల్లో రకరకాల కారణాల వల్ల ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కేటీఆర్ గుర్తు చేశారు. రైలు ట్యాంకర్లలో నీళ్లు తెచ్చే దుస్థితి ఒక నగరంలో ఉంది. పెరుగుతున్న ధరల కారణంగా మరో నగరం విస్తరించే అవకాశం లేదు. మరొక నగరంలో పొల్యూషన్ సమస్య, ఇంకో నగరంలో ట్రాఫిక్ సమస్య విపరీతంగా ఉంది. ఇలా అనేక సమస్యలతో దేశంలో నగరాలు సతమతమవుతున్న వేళ.. కానీ హైదరాబాద్‌కు అన్ని రకాల అనుకూలతలు ఉన్నాయని స్పష్టం చేశారు. కేసీఆర్ లాంటి దార్శనికత ముఖ్యమంత్రి ఉండటం వల్ల ఏడేండ్లలో ఎన్నో సమస్యలను పరిష్కారం అయ్యాయని కేటీఆర్ తెలిపారు.