హెచ్ఎండీఏ కార్యక్రమాలపై కేటీఆర్ సమీక్ష..

308
Minister KTR
- Advertisement -

హెచ్ఎండీఏ పరిధిలో జరుగుతున్న మౌలికవసతుల కార్యక్రమాలను పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు ఈరోజు సమీక్షించారు. పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మరియు ఉన్నత అధికారులతో కలిసి మంత్రి కేటీఆర్ ఈ సమీక్ష సమావేశాన్ని హైదరాబాద్లోని  జిహెచ్ఎంసి ఈవిడియం కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎండీఏ చేపట్టిన మౌలికవసతుల కార్యక్రమాలను మరింత వేగంగా ముందుకు తీసుకుపోయేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు. టిఎస్ బిపాస్ చట్టం వచ్చిన తర్వాత హెచ్ఎండిఏలో జరగబోయే మార్పులకు సంబంధించి ఇప్పటి నుంచి సంసిద్ధంగా ఉండాలని ముఖ్యంగా హెచ్ఎండిఏ రానున్న కాలంలో ప్లానింగ్, విజనింగ్, డిజైనింగ్ వంటి అంశాలపై మరింత దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని, అందుకు ఇప్పటినుంచే ఒక ప్రణాళికను రూపొందించుకోవాలని సూచించారు.

ఔటర్ రింగ్ రోడ్ కి సంబంధించిన చర్చ సందర్భంగా అవుటర్ రింగ్ రోడ్డు పైన చేపడుతున్న మౌలిక వసతుల కార్యక్రమాలకు సంబంధించి వివరాలను అధికారుల నుంచి అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్ గ్రోత్ కారిడార్ పరిధిలో ఉన్న బఫర్ జోన్ లో వచ్చిన నిర్మాణాల పట్ల కఠినంగా వ్యవహరించాలని, ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ విస్తరించి ఉన్న జిల్లాల కలెక్టర్ల సహకారాన్ని ఈ విషయంలో తీసుకోవాలని మంత్రి కేటీఆర్ సూచించారు. జిహెచ్ఎంసి తరహాలో అసెట్ ప్రొటెక్షన్ సెల్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఈ విషయంలో ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని సూచించారు. అవుటర్ రింగ్ రోడ్డు కు సంబంధించి వే సైడ్ అమెనిటిస్ (amenities)ఉండేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు.

ఔటర్ రింగ్ రోడ్ పైన హెచ్ఎండీఏ ప్రస్తుతం కొనసాగిస్తున్న గ్రీనరీ కార్యక్రమాల పట్ల సంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్, హెచ్ఎండీఏ అధికారులను ఈ విషయంలో అభినందించారు. హెచ్ఎండీఏ నిర్మిస్తున్న ఫ్లైఓవర్లు, మెహదీపట్నం, ఉప్పల్ స్కై వే లను  కూడా ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ సమీక్షించారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న చెరువుల సంరక్షణ కోసం తీసుకుంటున్న కార్యకలాపాల పైన మంత్రి కేటీఆర్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న ట్యాంక్ బండ్ సుందరీకరణ పనులకు సంబంధించిన వివరాలను కూడా మంత్రి కేటీఆర్ కి అధికారులు అందజేశారు.

- Advertisement -