పట్టణ ప్రగతితో పట్టణాల్లో మార్పుః మంత్రి కేటీఆర్

422
Ktr
- Advertisement -

పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాల్లో మార్పుదిశగా ఒక ముందడుగు పడిందని పురపాలక శాఖ మంత్రి కె.తారక రామారావు అన్నారు. పట్టణాల మార్పే లక్ష్యంగా ప్రభుత్వం చేపట్టిన తొలి దశ పట్టణ ప్రగతి విజయవంతం అయిందని తెలిపారు. పదిరోజుల పాటు ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలంతా కలిసి ఈ కార్యక్రమ విజయవంతం అయ్యేందుకు ప్రయత్నం చేశారన్నారు. పట్టణాల్లో గుణాత్మక మార్పు తీసుకురావడంలో ప్రగతి కార్యక్రమం తొలి అడుగుగా భావిస్తున్నామని తెలిపారు. ఈ పదిరోజుల కార్యక్రమం ద్వారా పట్టణాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తోందన్నారు. ఒక మంచి మార్పుకు బీజం పడిందన్నారు. ప్రభుత్వం పురప్రజల కోసం ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ముఖ్యంగా నూతన మున్సిపల్ చట్టం పైన ప్రజల్లో అవగాహన పెంచడంలో పట్టణ ప్రగతి విజయం సాధించిందని మంత్రి తెలిపారు.

పట్టణ ప్రగతి కార్యక్రమం పూర్తయిన నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన కార్యక్రమాలపై ఈరోజు హైదరాబాద్ లో మర్రిచెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో పురపాలక శాఖ మంత్రి తారక రామారావు సమీక్ష నిర్వహించారు. జిల్లాల అడిషనల్ కలెక్టర్తో పాటు వివిధ విభాగాల అధిపతులు, పురపాలక శాఖ ముఖ్య అధికారులు ఈ సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పట్టణ ప్రగతి కార్యక్రమం కోసం పని చేసిన ప్రతి ఒక్క ఉద్యోగికి, వివిధ శాఖల ఉద్యోగులకు పురపాలక శాఖ తరపున మంత్రి కెటియార్ ధన్యవాదాలు తెలిపారు. పట్టణ ప్రగతి కార్యక్రమం ద్వారా పట్టణాల్లో దశాబ్దాల కాలంగా పేరుకుపోయిన అనేక దీర్ఘకాలిక సమస్యలను గుర్తించడం జరిగిందన్నారు. వీటితోపాటు వెంటనే పరిష్కారం చేయగలిగిన పారిశుద్ధ్యం వంటి సమస్యలను ప్రగతి కార్యక్రమంలో భాగంగా పరిష్కరించామన్నారు. అయితే గుర్తించిన సమస్యలను భవిష్యత్తులో ప్రణాళికబద్దంగా పరిష్కరించేందుకు పనిచేయాలని అధికారులను మంత్రి అదేశించారు. ప్రస్తుతం పట్టణాల్లో గుర్తించిన సమస్యల పరిష్కారం కోసం వార్డ్ కమిటీలతోపాటు పట్టణ ప్రజలను భాగస్వాములను చేస్తూ, వారిని నిరంతరం చైతన్య పరుస్తూ చేస్తూ ముందుకు పోవాలని సూచించారు.

పట్టణ ప్రగతి కార్యక్రమం జరిగిన తీరుపైన జిల్లాల వారీగా అడిషనల్ కలెక్టర్లతో మాట్లాడి సమీక్షించారు. ఈ సందర్భంగా నూతన పురపాలక చట్టం తప్పనిసరి చేసిన ప్రాథమిక కార్యక్రమాల ఆమలుపైన ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా చేపట్టిన వార్డు పారిశుద్ద్య ప్రణాళిక, పట్టణ/నగర పారిశుద్ద్య ప్రణాళిక, పట్టణ వాటర్ ఆడిట్, పట్టణ హరిత ప్రణాళిక వంటి కార్యక్రమాలపైన ప్రధాన దృష్టిసారించాలన్నారు.

ప్రస్తుత మున్సిపాలిటీలో ఉన్న మౌళిక వసతులు, పౌర సౌకర్యాలపైన ఒక సంపూర్ణ నివేదిక రూపొందించాలని, దీంతోపాటు అయా మున్సిపాలిటీలను అదర్శ పట్టణాలుగా తీర్చిదిద్దేందుకు తీసుకోవాల్సిన చర్యలపైన ఒక రోడ్ మ్యాప్ రూపొందించుకుని, ఆ దిశగా పనిచేయాలన్నారు. ఇందులో భాగంగా మాడల్ మార్కెట్లు, పార్కులు, డంపుయార్డులు, పబ్లిక్ టాయ్ లెట్స్, స్ర్టీట్ వెండింగ్ జోన్లు, నర్సరీలు, శ్మశన వాటికలు, అర్బన్ లంగ్ స్పేసేస్, ఒపెన్ జిమ్స్ మొదలైన సౌకర్యాలను ఖచ్చితంగా ఉండేలా చూడాలన్నారు. ఇందుకోసం రానున్న నాలుగు సంవత్సరాలకు సంవత్సరం వారీగా దశల వారీగా పూర్తి చేసేందుకు వీలున్న అంశాలను ముందే నిర్ధేశించుకోవాలన్నారు. ఏ పట్టణమైనా ఒకే రోజు అదర్శపట్టణంగా మారదని, అయితే ఆ దిశగా నిరంతరం అభివృద్ది కొనసాగించాలని మంత్రి తెలిపారు. ప్రతి అడిషనల్ కలెక్టర్ కు తన పరిధిలో ఉన్న అన్ని పురపాలక పట్టణాల గురించి అమూలాగ్రం తెలిసి ఉండాలన్నారు. మరోసారి పురపాలికలపైన సమీక్ష సమావేశం నిర్వహిస్తామన్న మంత్రి, ఆ సమావేశం నాటికి పూర్తి స్ధాయి ప్రణాళికలతో సిద్దంగా ఉండాలని సూచించారు.

- Advertisement -