నల్గొండ సమగ్ర అభివృద్ధికి వేగంగా ముందుకు కదలాలి- కేటీఆర్‌

64
- Advertisement -

నల్గొండ పట్టణ అభివృద్ధికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన మాట ప్రకారం అభివృద్ధికి అడుగులు పడుతున్నాయి. నల్గొండ నియోజకవర్గ పరిధిలోని తిప్పర్తి, కనగల్ మండల కేంద్రాలతో పాటు నల్లగొండ పరిసర గ్రామాలు, నకిరేకల్ నియోజకవర్గ పరిధిలోని మంగలపల్లి, ఎల్లారెడ్డిగూడెం, చేరువుగట్టు గ్రామాలను కలుపుతూ నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (NUDA) గా మారుస్తూ ప్రభుత్వం జి.ఓ విడుదల చేసింది. ఈ మేరకు పట్టణ అభివృద్ధి ప్రణాళికలపైన ప్రత్యేకంగా ఈరోజు హైదరాబాద్ లో మంత్రి జగదీష్ రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ మరియు పురపాలక శాఖ అధికారులు జిల్లా ఉన్నతాధికారులతో పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సమీక్షలో నీలగిరి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (NUDA) గా మారుస్తూ ప్రభుత్వం విడుదల చేసిన జి.ఓ ను పురపాలక శాఖ మంత్రి కేటీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి సమక్షంలో నల్గొండ శాసన సభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి కి అందజేశారు. అంతే గాకుండా నల్గొండ పట్టణంలో రోడ్ల విస్తరణకు గాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశంతో విడుదల చేసిన నిధుల జి.ఓ లను మంత్రి కేటీఆర్ భూపాల్ రెడ్డికి అందజేశారు.

అనంతరం సమీక్షా సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. నల్గొండ జిల్లా కేంద్రం సమగ్ర అభివృద్ధి కోసం వేగంగా ముందుకు కదలాలని స్థానిక అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా పట్టణం సమగ్ర రూపురేఖలు మార్చేందుకు ప్రభుత్వం పని చేస్తుందని ఆయన ఇచ్చిన హామీ మేరకు పట్టణాన్ని సమగ్రంగా మార్చే ప్రణాళికలను సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ అధికారులను కోరారు. నల్లగొండ పట్టణ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేస్తుందని ముఖ్యంగా పురపాలక శాఖ ఆధ్వర్యంలో పట్టణ రూపురేఖలు సమూలంగా మార్చాలని ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. పట్టణ ప్రజలకు అవసరమైన కనీస పౌర వసతుల కల్పనతో పాటు దీర్ఘకాలికంగా పట్టణ భవిష్యత్ అవసరాలకు అవసరమైన మౌలిక వసతుల కల్పన పైన కూడా దృష్టి సారించాలని అధికారులను కోరారు.

ఈ సమావేశం సందర్భంగా పురపాలక శాఖ ఉన్నతాధికారులు నల్గొండ పట్టణంలో చేపట్టబోయే అభివృద్ధి కార్యక్రమాల గురించి సమగ్రంగా వివరాలు అందజేశారు. రోడ్లు, తాగునీటి సరఫరా, విద్యుత్, గ్రీనరీ పార్కుల అభివృద్ధి, ఉదయ సముద్రం సుందరీకరణ వంటి కార్యక్రమాల గురించి వివరించారు. పట్టణ అభివృద్ధికి సంబంధించి స్వల్పకాలిక లక్ష్యాలతో పాటు రానున్న ఏడాది లోపల చేపట్టబోయే వివిధ కార్యక్రమాల జాబితాను అందజేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణ అభివృద్ధి పైన నిరంతరం సమీక్ష సమావేశాలు ఉంటాయని తెలిపిన కేటీఆర్ ఈ మేరకు ఎప్పటికప్పుడు అధికారులు పట్టణ పురోగతిని తెలియజేయాలని సూచించారు. ఇవి కాకుండా ఇంకా ఏమైనా స్థానికంగా ప్రాధాన్యత కలిగిన అంశాలు ఉంటే ఇందులో జతపరచాలని తెలిపారు.

- Advertisement -