రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈరోజు నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఇందులో భాగంగా కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మధ్య నిర్మించిన రైల్వే అండర్ బ్రిడ్జి(ఆర్‌యూబీ)ని మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. అనంతరం కే.పీ.హెచ్.బి కాలనీ, అంబేద్కర్ నగర్ లో విడిసిసి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు.
వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప్రాజెక్టు (ఎస్‌ఆర్డీపీ)లో భాగంగా ఈ ఆర్‌యూబీని నిర్మించారు. రూ.66.59 కోట్ల వ్యయంతో 410 మీటర్ల పొడవు, 20.60 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మించారు. ఈ ఆర్‌యూబీ అందుబాటులోకి రావడంతో కూకట్‌పల్లి-హైటెక్‌సిటీ మార్గంలో ట్రాఫిక్ ఇబ్బందులు శాశ్వతంగా తొలగిపోయాయి. ముఖ్యంగా ఐటీ ఉద్యోగులకు ట్రాఫిక్ చిక్కులు తప్పాయి.
ఈ కార్యక్రమంలో మంత్రి సిహెచ్ మల్లా రెడ్డి, ఎమ్మెల్యే మాధవరం కృష్ణా రావు, ఎమ్మెల్సీ నవీన్ కుమార్, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్ రెడ్డి పాల్గొన్నారు.