ప్రతి నగర కార్పొరేషన్ కు విపత్తు నిర్వహాణ విభాగాల (డిజాస్టర్ మేనేజ్ మెంట్ మరియు విజిలెన్స్ ఫోర్స్ )ను ఏర్పాటు చేయనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ప్రతి నగరంలో అనుకోని ప్రమాదాలను, విపత్తులను ఎదుర్కోనేందుకు పక్కా ప్రణాళికలతో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని, ఈ దిశగా కార్పొరేషన్లలో విపత్తు నిర్వహాణ విభాగాలను ఏర్పాటు చేయాలని మంత్రి, పురపాలక శాఖాధికారులను అదేశించారు. ముందుగా స్మార్ట్ సిటీ కార్యక్రమంలో భాగంగా ఉన్న వరంగల్, కరీంనగర్ కార్పొరేషన్లలో తొలిదశలో విపత్తు నిర్వహణ విభాగాలను ఏర్పాటు చేయాలన్నారు. హైదరాబాద్ నగరంలో ఒకటిన్నర సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన విపత్తు నిర్వహాణ విభాగం సమర్ధవంతంగా పనిచేస్తున్నదన్న మంత్రి, ఇదే ప్రయత్నాన్ని ఇతర కార్పొరేషన్లకు విస్తరిస్తామన్నారు.
ఈ రోజు హైదరాబాద్ లోని జీహోచ్‌యంసీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ ఫోర్స్ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈ విభాగాల వలన భారీ వర్షాలు, ప్రమాద సమయాల్లో ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని సాద్యమైనంత తగ్గేంచేందుకు లేదా నివారించేందుకు వీలు కలుగుతుందని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సందర్భంగా జీహోచ్‌యంసీ విపత్తు నిర్వహణ దళం చేపట్టిన కార్యక్రమాలు, వాటికి ప్రజల నుంచి వస్తున్న స్పందన, ఈ విభాగాన్ని మరింత బలోపేతం చేసేందుకు అవసరం అయిన చర్యలను అడిగి తెలుసుకున్నారు.
ప్రస్తుతం నగరంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఈ విభాగం వేగంగా పనిచేస్తున్నదని, చాల చోట్ల మోబైల్ టీంలను ఏర్పాటు చేశామని డిజాస్టర్ మేనేజ్ మెంట్ మరియు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టర్ విశ్వజిత్ కంపాటి మంత్రికి తెలిపారు. ఈ విభాగం ఏర్పాటు చేశాక నగరంలో భారీ వర్షాల వలన ఉత్పన్నం అవుతున్న నీరు నిలిచిపోవడం, కూలిన చెట్లను తొలగించడం వంటి తక్షణ సమస్యలను సమర్ధవంతంగా ఎదుర్కొంటున్నారని మంత్రి అభినందించారు. జియచ్ యంసి విపత్తు నిర్వహాణ విభాగం అనుభవాలు, కార్యక్రమాలను ఇతర నగరాల్లో విస్తరించేందుకు పనిచేయాలని డైరెక్టర్ విశ్వజిత్ ను మంత్రి అదేశించారు.
జీహోచ్‌యంసీ పరిధిలో జరిగే ఉల్లంఘనల నిర్వహాణను అన్ లైన్ చేసేందుకు వీలు కల్పించే సెంట్రల్ ఎన్ ఫోర్స్ మెంట్ సెల్ మరియు మొబైల్ అప్లికేషన్ ను మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావులు ఆవిష్కరించారు. వీటి ద్వారా అక్రమంగా భవన నిర్మాణ వ్యర్ధాల పారవేత, చెత్త వేయడం, పుట్ పాత్ ల అక్రమణ మొదలైన ఉల్లంఘనలు, జరిమానాలను ఈ యాప్ ద్వారా పారదర్శకంగా నిర్వహించవచ్చు. దీంతోపాటు జియచ్ యంసి విపత్తు నిర్వహణ దళంలోని ఉద్యోగుల ప్రమాద భీమా, అరోగ్య భీమా సౌకర్యాన్ని సైతం ఈరోజు మంత్రులు ప్రారంభించారు. ఈ సమావేశంలో మంత్రులతోపాటు నగర్ మేయర్ బొంతు రామ్మోహన్, పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కూమార్, నగర కమీషనర్ లోకేష్ కూమార్ మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.