రైతులకు అండగా ఉంటామని.. ఈ నెల 8న తలపెట్టిన భారత్ బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలుపుతామన్నారు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్. ఆదివారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మంత్రి శ్రీ కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో మంత్రులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, మహమూద్ అలీ, శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ కేశవరావు, ఎమ్మెల్యేలు బాల్క సుమన్, ఎమ్మెల్సీ శ్రీనివాస్ రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షులు పల్లా రాజేశ్వర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నూతనంగా తెచ్చిన వ్యవసాయ చట్టాలు.. అవి నల్లచట్టాలు. పార్లమెంట్ వేదికగా కేంద్ర వ్యవసాయ బిల్లులను వ్యతిరేకించామన్నారు.రాజ్యసభలో కేంద్రం మందబలంతో బిల్లులను ఆమోదింపజేసుకుంది.ఎముకలు కొరికే చలిలో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు కేంద్రంతో పోరాడుతున్నారు. పోరాటం చేస్తున్న రైతులకు టీఆర్ఎస్ పార్టీ సెల్యూట్ చేస్తుంది. వారికి సంఘీభావంగా టీఆర్ఎస్ శ్రేణులు ఎల్లుండి బంద్‌లో భాగస్వాములు కావాలి. రైతుబంధు సమితి సభ్యులు రైతులను కదిలించాలని మంత్రి కోరారు.
వ్యాపార, వాణిజ్యవేత్తలకు మా విన్నపం.. రైతులకు సంఘీభావంగా 2 గంటలు బంద్ చేయండి. కేంద్ర చట్టాలతో రైతు ఎలా ఇబ్బంది పడుతున్నాడో.. కార్పోరేట్లకు వ్యవసాయం ధారాదత్తం చేసే కుట్రలను వివరించండి. మోటారు వాహనాల యజమానులు బంద్ కు సహకరించాలి. టీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు జాతీయ రహదారులపై మోహరించి ధర్నా, రాస్తారోకోలతో మద్దతు తెలపాలి. ఈ నల్లచట్టాలు పోయేదాకా రైతులకు టీఆర్ఎస్ అండగా నిలుస్తుందన్నారు. కులాలు, మతాలు, పార్టీలకు అతీతంగా రైతులకు మద్దతుగా నిలుద్దామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.