కార్పొరేట్ స్థాయిలో స్కూల్ బిల్డింగ్‌ను నిర్మించడంతో రాష్ట్రంలో సిరిసిల్ల ప్రభుత్వ పాఠశాలకు ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు మంత్రి కేటీఆర్. సిరిసిల్ల పర్యటనలో భాగంగా జిల్లా కేంద్రంలో ఆధునీకరించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ప్రారంభించిన అనంతరం మాట్లాడిన కేటీఆర్..రాష్ట్రంలో సంక్షేమ పాఠశాలల్లో చదివిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో ర్యాంకులు వస్తున్నాయన్నారు.
పిల్లలకోసం ఎంత చేసినా తక్కువేనని….. పిల్లలను తల్లిదండ్రులు పోత్సహించాలని, తన తల్లిదండ్రుల ప్రోత్సాహమే తనను ఇంతటివాడిని చేసిందని వెల్లడించారు. పలు సేవా సంస్థల సహకారంతో కరోనా సమయంలో ఈ పాఠశాల పునర్నిర్మించామని తెలిపారు. నాలుగు వందల మంది ఒకేసారి భోజనం చేసే విధంగా డైనింగ్ హాల్, కంప్యూటర్ ల్యాబ్, 39 తరగతి గదులతో భవనాన్ని నిర్మించామన్నారు. ఇలాంటి పాఠశాలలు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పాటు కావాలని సీఎం కేసీఆర్ ఆకాంక్ష అని చెప్పారు.
విదేశాల్లో చదువుకునేందుకు రూ.29 లక్షల విద్యా రుణం ఇస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ మాత్రమేనని చెప్పారు. ఉద్యోగం కోసం చదువు కాకుండా.. విద్యా విజ్ఞానం నేర్పేలా విద్యార్థులు తయారు కావాలని సూచించారు.