ముఖ్యమంత్రి కెసిఆర్ భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో అన్ని వర్గాల ప్రజల భద్రత, క్షేమం,సంక్షేమం, ఉన్నతికి అంకితభావంతో కృషి చేస్తున్నారని షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు.దేశంలో మరెక్కడా లేని విధంగా తెలంగాణలో 440కి పైగా సంక్షేమ పథకాలు,కార్యక్రమాలను ప్రవేశపెట్టి విజయవంతంగా అమలు చేస్తున్నారన్నారు.ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మంత్రి కొప్పుల అధ్యక్షతన ఎస్సీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా తమ వర్గాల ప్రజల అభ్యున్నతికి అదనంగా 1,000కోట్ల రూపాయలు ప్రకటించిన ముఖ్యమంత్రికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.మంత్రి మాట్లాడుతూ, ఎస్సీల సముద్ధరణకు బడ్జెట్లో 16,534 కోట్లు కేటాయించడాన్ని గుర్తు చేశారు.ముఖ్యమంత్రి తాజాగా ప్రకటించిన 1,000 కోట్లతో ఏయే కార్యక్రమాలు చేపడితే ఎస్సీలకు మరింత మేలు జరుగుతుందనే అంశంపై కూలంకషంగా చర్చించారు. సమావేశంలో చర్చించిన అంశాలు,ప్రతిపాదనలను క్రోడికరించి త్వరలో ముఖ్యమంత్రిని కలిసి నివేదించాలని ఈ సందర్భంగా తీర్మానించారు.