టీఆర్ఎస్ అభ్యర్థి నోముల భగత్‌ను గెలిపించిన నాగార్జున సాగర్ నియోజకవర్గ ప్రజలకు మంత్రి జగదీశ్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా సాగర్ నియోజకవర్గంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్‌పై ప్రజల్లో ఉన్న నమ్మకానికి, విశ్వసానికి నిదర్శనం ఈ విజయం. సందర్భం ఏదైనా తెలంగాణ సమాజం అంత సీఎం కేసీఆర్ వెంట నడుస్తుంది అని మరో సారి రుజువైందన్నారు. బీజేపీ వాళ్ళు ,కాంగ్రెస్ వాళ్లు సబ్యత సంస్కారం లేకుండా జగుప్సాకరంగా మాట్లాడారు. దుబ్బాక ఒక్కటి గెలిచి బీజేపీ వాళ్ళు ఎగిరెగిరి పడ్డారని మంత్రి ఎద్దేవ చేశారు.
ఏదో ఒక చిన్న నిర్లక్ష్యం వల్లనో, అతివిశ్వాసం వల్లనో ఒక ఎన్నిక ఫలితం మారింది. ఆ తర్వాత కేసీఆర్‌తో పాటు మా అందరిపై ఇష్టమొచ్చినట్లు మాట్లాడారు. ఈ విజయంతో గర్వపడటం లేదు. ఎన్నికల్లో ఒక్క విజయం వచ్చినంత మాత్రాన పొంగిపోవద్దు అని సూచించారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు విజ్ఞత లేకుండా ప్రవర్తించారు. గత చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా కేసీఆర్ నాయకత్వంలో అభివృద్ధి అంటే ఏందో ఈ రాష్ట్ర ప్రజలు చూశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసింది ఒక్క టీఆర్ఎస్ పార్టీ మాత్రమే. తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆరే శ్రీరామరక్ష అని అన్నారు.
నల్లగొండ జిల్లాలో ఈ ఆరున్నరేండ్లలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి అమలు చేశారు. వ్యవసాయ రంగం గత ప్రభుత్వాల విధానాలతో నిర్లక్ష్యానికి గురైంది. కానీ కేసీఆర్ సీఎం అయ్యాక వ్యవసాయ రంగంలో అద్భుతాలు సృష్టించామని తెలిపారు. వరి దిగుబడిలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. దీనికంతటికి కారణం కేసీఆర్ నాయకత్వమే కారణమన్నారు. చివరి ఎకరా వరకు నీరందంచి జిల్లాను సశ్యశ్యామలం చేస్తున్నారని అన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చిన తరువాతనే అభివృద్ధి అంటే ఏంటో ప్రజలకు తెలిసింది. అందుకే సాగర్ నియోజకవర్గ ప్రజలు టీఆర్‌ఎస్ పార్టీకి, అభివృద్ధికి పట్టం కట్టారని మంత్రి జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.