ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణకు హరితహారం కార్యక్రమాన్ని అధికారులు చిత్తశుద్ధితో అమలు చేస్తూ..లక్ష్యాన్ని చేరుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. ఆరవ విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా నిర్దేశించి లక్ష్యం, సాధించిన ప్రగతిపై మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి గురువారం అరణ్య భవన్ నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జిల్లాల వారీగా టార్గెట్లు, సాధించిన ఫలితాలను మంత్రి విశ్లేషించారు. హరితహారం కార్యక్రమంతో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయని, పచ్చదనం పెరగడంతో అందరూ హర్షిస్తున్నారన్నారు. ఇదే స్పూర్తిని కొనసాగిస్తూ అధికారులందరూ అంకితభావంతో పని చేయాలన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…నిర్ధేశించిన 29.86 కోట్ల మొక్కలు నాటాల్సిన లక్ష్యానికిగాను ఇప్పటి వరకు 19.58 కోట్ల (65%) మొక్కలు నాటినట్టు తెలిపారు. ఆగస్టు నెలాఖరు కల్లా లక్ష్యాన్ని పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
నాటే ప్రతి మొక్క ఎదిగే విధంగా సంరక్షణ చర్యలు తీసుకోవాలని, ఖచ్చితంగా జియోట్యాగింగ్ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. రానున్న రెండేళ్ళకు గాను క్యాలెండర్ ఇయర్ ప్లాన్ ను రూపొందించుకోవాలని, నర్సరీల్లో ఎత్తైన మొక్కలను పెంచాలని తెలిపారు. పల్లె ప్రకృతి వనాలతో గ్రామాల్లో పచ్చదనం మరింత పెరిగిందని, సర్పంచ్ లు, ఇతర ప్రజాప్రతినిదులు ప్రకృతి వనాల ఏర్పాటును సవాల్ గా తీసుకుని అభివృద్ది పరుస్తున్నారని పేర్కొన్నారు. ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లతో మొక్కల సంరక్షణ శాతం పెగిందని, వాటి సంరక్షణకు వాచర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు.
పల్లె వనాలు (యాదాద్రి మోడల్), స్మృతి వనాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. ప్రకృతి వనాల ఏర్పాటు, నర్సరీల్లో మొక్కల పెంపకం మిగితా విభాగాల అధికారులు అటవీ శాఖతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. నర్సరీల్లో పెంచే మొక్కలు పంపిణీ చేయాలని, కానీ నిరుపయోగం కాకుండా చూడాల్సిన బాధ్యత అధికారులదేనని చెప్పారు. దానికి బదులుగా గ్రామ పరిధిలో మొక్కలు నాటేలా చూడాలని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో కూడా పచ్చదనం పెంచాలన్న సీయం కేసీఆర్ ఆలోచనలకు అనుగుణంగా అధికారులు ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు.
అదేవిధంగా నాటిన మొక్కల్లో 85% మొక్కలు బతకాల్సిందేనని, దీనికి ఎలాంటి మినయింపులు లేవని స్పష్టం చేశారు. లెక్కల కోసం కాకుండా నాటిన మొక్కలు పెరిగి పచ్చదనం కనిపించేలా అధికారులు పని చేయాలన్నారు. ఈ సమావేశంలో అటవీ శాఖ స్పెషల్ సీఎస్ శాంతికుమారి, అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్.శోభ, పీసీసీఎఫ్ ఆర్.ఎం.డొబ్రియల్, అదనపు పీసీసీఎఫ్ లు చంద్రశేఖర్ రెడ్డి, సునీతా భగవత్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.