హరితహారం ఏర్పాట్లపై మంత్రి అల్లోల‌ సమీక్ష..

209
Minister Indrakaran Reddy Review On Haritha haram
- Advertisement -

జూన్ 20 నుంచి ప్రారంభంకానున్న ఆర‌వ విడ‌త‌ హరిత హారం కార్య‌క్ర‌మానికి ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో సమాయత్తం కావాల‌ని అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి ఆదేశించారు. గత అనుభవాలతో ఆచరణ సాధ్యమైన లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రణాళికలు రూపొందించుకోవాల‌ని సూచించారు. సోమ‌వారం అర‌ణ్య భ‌వ‌న్‌లో ఆర‌వ విడ‌త హ‌రిత హార కార్య‌క్ర‌మంపై అట‌వీ శాఖ ఉన్న‌తాధికారుల‌తో మంత్రి స‌మీక్షించారు. గ‌తంలో నాటిన మొక్క‌లు- వాటి సంర‌క్ష‌ణ‌, వేసవి కాలంలో మొక్కలను కాపాడుకోవడానికి తీసుకుంటున్న జాగ్ర‌త్త‌లు, గ్రీన్ ఫ్రైడే కార్య‌క్ర‌మం, వన్యప్రాణుల దాహార్తిని తీర్చేందుకు తాగునీటి సౌకర్యాలు, త‌దిత‌ర అంశాల‌పై మంత్రి ఆరా తీశారు.

Minister Indrakaran Reddy Review On Haritha haram

ఈ సంద‌ర్బంగా మంత్రి మాట్లాడుతూ… ఆర‌వ విడ‌త తెలంగాణ కు హరిత హార కార్య‌క్ర‌మంలో భాగంగా అట‌వీ శాఖ అద్వ‌ర్యంలో 3.59 కోట్ల మొక్క‌ల‌ను నాటేందుకు సిద్దంగా ఉంచామ‌న్నారు. ప్రతి గ్రామం, మున్సిపాలిటీలలో నర్సరీలను ఏర్పాటు చేయాలన్న రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలమేరకు ఆయా శాఖ‌ల ఆద్వ‌ర్యంలో నర్సిరీల్లో మొక్క‌లు పెంచుతున్నార‌ని తెలిపారు. జీహెచ్ఎంసీ,హెచ్ఎండీఏ, పీఆర్ అండ్‌ ఆర్డీ ప‌రిధిలోని న‌ర్స‌రీల్లో 21.16 కోట్ల మొక్క‌లను పెంచార‌న్నారు.మొత్తంగా 24.74 కోట్ల మొక్క‌లు సిద్దంగా ఉంచామ‌ని వెల్ల‌డించారు. ఇందులో అటవీశాఖ తరపున హరితహార కార్య‌క్ర‌మంలో భాగంగా నాటే పెద్ద మొక్క‌లు 2.16 కోట్లు కాగా, కంపాలో భాగంగా ప్రత్యామ్నాయ అట‌వీక‌ర‌ణ‌కు 1.42 కోట్ల పెద్ద మొక్క‌లు అందుబాటులో ఉన్నాయ‌న్నారు.

ఆర‌వ విడ‌త హ‌రిత హారం కార్య‌క్ర‌మం నాటికి పెద్ద ఎత్తున చింత మొక్క‌ల‌ను పెంచాల‌న్న‌ సీఎం కేసీఆర్ ఆదేశాల మేర‌కు అట‌వీ శాఖ ఆద్వ‌ర్యంలో 24.50 ల‌క్ష‌లు, గ్రామ పంచాయ‌తీ న‌ర్స‌రీల్లో 81.69 ల‌క్ష‌ల చింత మొక్క‌ల‌ను పెంచామ‌న్నారు. అదేవిధంగా బీడీ ఆకుల సేక‌ర‌ణ‌ త్వ‌రిత‌గ‌తిన పూర్తి అయ్యేలా అట‌వీ అధికారులు చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. ప్రతి శాఖ నుంచి వారు నిర్ధేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా ప‌ని చేయాల‌ని, అట‌వీ శాఖ అధికారులు కూడా ఆయా శాఖ‌లను స‌మ‌న్వ‌యం చేసుకుంటూ ముందుకు సాగాల‌ని సూచించారు. అందరూ భాగస్వామ్యులై ఆర‌వ విడ‌త హ‌రిత హారం కార్య‌క్ర‌మాన్ని విజయవంతం చేయాలన్నారు. ఈ స‌మావేశంలో అటవీ సంరక్షణ ప్రధాన అధికారి (పీసీసీఎఫ్) ఆర్. శోభ, అదనపు పీసీసీఎఫ్ స్వర్గం శ్రీనివాస్, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -