కొమురవెల్లి మల్లన్నను దేవదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు. గురువారం మల్లన్న దర్శనార్థం ఆలయానికి విచ్చేసిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, ఆయన సతీమణి విజయలక్ష్మిలకు దేవస్థాన కార్యనిర్వహణాధికారి, అర్చకస్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు.
మంత్రి దంపతులు ఆలయంలో స్వామిని దర్శించుకుని, అభిషేక పూజలు నిర్వహించారు. మల్లన్న స్వామి వారికి 50 గ్రాముల బంగారు మీసాన్ని సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం ఆశీర్వచన మండపంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి దంపతులకు వేదపండితులు వేదమంత్రాలు పలుకగా, అర్చకులు ఆశీర్వచనాలు, తీర్థప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ…ఆరేండ్లలో కొమురవెల్లి మల్లన్న క్షేత్రం బాగా అభివృద్ధి చెందిందన్నారు. భక్తులకు మరిన్ని సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం 130 ఎకరాల భూమిని ఆలయానికి కేయించిందని వెల్లడించారు. రానున్న రోజుల్లో ఆలయాన్ని అభివృద్ది చేస్తామని మంత్రి తెలిపారు.