అటవీ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేయడానికి, పర్యవేక్షించడానికి హైదరాబాద్ ITC కాకతీయ హోటల్‌లో ఈరోజు ఏర్పాటు చేసిన జాతీయ స్థాయి కంపా వర్క్ షాప్‌లో మంత్రులు కేటీఆర్, ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. తెలంగాణలో చేపడుతున్న హరితహారం మరియు ఇతర అటవీ సంరక్షణ కార్యక్రమాల గురించి సమావేశంలో ప్రస్తావించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుత, భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణ స్థాయిని పెంపొందించే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ మొక్కల పెంపకం, వాటి సంరక్షణకు అధిక ప్రాధన్యతనిస్తున్నారని అన్నారు. అడవుల పెంపకం, పచ్చదనం విస్తీర్ణాన్ని 24% నుంచి 33% పెంచేందుకు తెలంగాణకు హరితహారం అనే మహోత్తర కార్యక్రమానికి 2015 లో సీఎం కేసీఆర్ శ్రీకారం చుట్టారు. అటవీ ప్రాంతం వెలుపల 130 కోట్లు, అటవీ ప్రాంతంలో 100 కోట్ల మొక్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకున్నాము.
తెలంగాణలో డైనమిక్ సీఎం కేసీఆర్ ఉన్నారని, ఆయన సారధ్యంలో తెలంగాణ రాష్ట్రం అతి తక్కువ కాలంలోనే అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి దేశానికి ఆదర్శంగా నిలిచారని మంత్రి ఇంద్రకరన్ రెడ్డి తెలిపారు. కాంపా నిధులతో అడవులను రక్షించడం, అటవీని మెరుగుపరచడం, వన్యప్రాణుల సంరక్షణ, పచ్చదనం పెంచడం, జీవవైవిధ్యాన్ని కాపాడటం, కార్బన్ సీక్వెస్ట్రేషన్, భూమి క్షీణతను తటస్థత స్థితికి తీసుకురావడం, నీటి లభ్యత, తదితర వాటిని మెరుగుపరచడానికి అటవీ కార్యాకలపాలు చేపట్టడం జరిగిందని మంత్రి అన్నారు.
ఈ కార్యక్రమంలో సీఎస్ సోమేష్ కుమార్, కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ డీజీ, ప్రత్యేక కార్యదర్శి చంద్ర ప్రకాష్ గోయల్, అదనపు డీజీ, జాతీయ కాంపా సీఈవో సుభాష్ చంద్ర, రాష్ట్ర అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యాదర్శి శాంతి కుమారి, పీసీసీఎఫ్ ఆర్. శోభ, పీసీసీఎఫ్ (కాంపా సీఈవో) లోకేష్ జైస్వాల్, పీసీసీఎఫ్ (సోషల్ ఫారెస్ట్రీ) ఆర్.ఎం. డోబ్రియల్, ఇతర రాష్ట్రాలకు చెందిన పీసీసీఎఫ్ లు, అధికారులు పాల్గొన్నారు.