అమరుల త్యాగాలు, ప్రజా పోరాటాలు ఫలితంగా ఏర్పడిన తెలంగాణలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తున్నామని తెలిపారు మంత్రి హరీశ్ రావు. సిద్దిపేట కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించిన అనంతరం మాట్లాడిన హరీశ్… ఉద్యమ నాయకుడు కేసీఆర్ నాయకత్వంలో ఢిల్లీని కదిలించి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు.
70 ఎండ్లలో జరగని పనులను ఏండేండ్లలో పూర్తిచేశామని…దేశానికే తెలంగాణ తలమానికంగా మారిందన్నారు. సిద్దిపేట జిల్లా ప్రజల కల అయిన సిద్దిపేట జిల్లాను సీఎం కేసీఆర్ ఆశీస్సులతో నెరవేర్చుకున్నామన్నారు.
వానాకాలం నుంచే మల్లన్న సాగర్ జలాశయం ఫలితాలు అందేలా చూస్తున్నామని తెలిపారు. సిద్దిపేట జిల్లాలో పంట కాలువలు, పిల్ల కాలువల నిర్మాణానికి రైతులు ఉద్యమ స్ఫూర్తితో స్వచ్ఛందంగా సహకరించాలని కోరారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్‌లోని గోదావరి జిల్లాలను తలదన్నేలా సిద్దిపేట జిల్లా ఆవిర్భవిస్తుందన్నారు.