అయోధ్య రాముడికి హరీశుడి విరాళం..!

151
harish
- Advertisement -

అయోధ్య రామమందిర నిర్మాణానికి విరాళాల పేరుతో రాజకీయం చేస్తున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు మంత్రి హరీష్‌రావు వ్యూహాత్మకంగా చెక్ పెట్టేలా వ్యవహరించారు. అయోధ్య రామ మందిర నిర్మాణానికి విరాళాలు సేకరించే బాధ‌్యతను రామజన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు, విహెచ్ఎంపీ వంటి హిందూ ధార్మిక సంస్థలకు అప్పగించారు. అయితే బీజేపీ నేతలు, కార్యకర్తలు కాషాయ కండువాలు కప్పుకుని ఊరూరు తిరుగుతూ విరాళాలు సేకరించడంపై మెట్‌పల్లి టీఆర్ఎస్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు అభ్యంతరం వ్యక్తం చేశారు.తమకు విరాళాల బుక్స్ ఇస్తే..తాము కూడా విరాళాలు సేకరిస్తామని, అంతే కాని బీజేపీ నేతలు కాషాయ కండువాలు కప్పుకుని ఊరారా తిరగడం ఏంటని ప్రశ్నించడంతో కాషాయ దండు రెచ్చిపోయి నానా రచ్చ చేసింది.

ఇక పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లాధర్మారెడ్డి స్వయంగా తన ఊరిలో రాములోరి గుడి కట్టించారు. రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరించడాన్ని తప్పుపట్టడం లేదు..కాని బీజేపీ నేతలు వసూళ్లు చేసిన రూ. 1000 కోట్ల లెక్కల మాటేంటీ..ఆ డబ్బులు ఎక్కడకు పోతున్నాయని ప్రశ్నించారు. అంతే కాషాయమూకలు వరంగల్‌లోని చల్లా ఇంటిపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. రాముడి పేరుతో బండి బ్యాచ్ చేస్తున్న నీచ రాజకీయంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రామమందిర నిర్మాణానికి విరాళాలు సేకరించడంపై ఎవరికీ అభ్యంతరం లేదు. శ్రీరామ చంద్రుడు ఒక్క బీజేపీ వాళ్లేకే కాదు..అందరికీ దేవుడే..పార్టీలకతీతంగా జరగాల్సిన విరాళాల సేకరణ బీజేపీ నేతలు చేయడంపట్ల కూడా ఎవరికీ అభ్యంతరం లేదు..కాని ప్రజలు ఇచ్చిన డబ్బులు పక్కదారి పడుతున్నాయన్నదే సందేహం..ఆ విషయమై నిలదీసిన వారికి సమాధానం చెప్పాల్సింది పోయి ఇలా రాళ్లదాడులకు పాల్పడడం కాషాయ దండుకే చెల్లింది.

అయితే తాజాగా అయోధ్య రామమందిరం విరాళాల పేరుతో రాజకీయం చేస్తున్న బండి బ్యాచ్‌కు మంత్రి హరీష్‌రావు తనదైన శైలిలో చెక్ పెట్టారు. అయోధ్య రామ మందిరానికి హరీష్‌ రావు లక్షా నూటపద హార్ల విరాళం ఇచ్చారు. సిద్ధిపేటలోని మంత్రి నివాసంలో రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ జిల్లా ప్రతినిధులు ఆయన్ను కలిశారు. ఈ సందర్భంగా హరీశ్ రావు రూ.1,01,116 చెక్‌ను వారికి అందించారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి తన వంతు విరాళం ఇవ్వడం అదృష్టంగా భావిస్తున్నానని మంత్రి వ్యాఖ్యానించారు. అయోధ్య రామమందిరం విరాళాల విషయంలో బీజేపీ రాజకీయం చేస్తున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్ కీలక నేత మంత్రి హరీశ్ రావు రామ మందిర నిర్మాణానికి విరాళం ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఇక మరో మంత్రి ఈటల రాజేందర్ కూడా రామమందిరంకు లక్షా నూటపదహార్లు విరాళం ఇచ్చారు. ఇప్పటికే ఆందోల్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ అయోధ్య రామ మందిర నిర్మాణం కోసం విరాళాలు సేకరించే పనిలో ఉన్నారు. టీఆర్ఎస్ నేతలంతా రామమందిర నిర్మాణానికి పెద్ద ఎత్తున విరాళాలు ఇవ్వడానికి ముందుకు వస్తుండడంతో రాముడి పేరుతో రాజకీయం చేద్దామన్న బండి సంజయ్‌‌కు చెక్‌ పెట్టినట్లైంది.

- Advertisement -