సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్ రావు

371
Harish Rao In Gajwel
- Advertisement -

ముఖ్యమంత్రి కేసీఆర్ రాక కోసం గజ్వెల్ నియోజకవర్గం సర్వాంగసుందరంగా ముస్తాబైంది. బుధవారం సీఎం కేసిఆర్ పర్యటన సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. జిల్లా మంత్రి హరీశ్ రావు ఏర్పాట్లను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. సీఎం కేసీఆర్ తన గజ్వెల్ పర్యటనలో భాగంగా నియోజకవర్గ పరిధిలోని పలు అభివృద్ది కార్యక్రమాలకు ప్రారంబొత్సవాలు, శంకుస్థాపన చేయనున్నారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ పర్యటన ఖరారైన నేపథ్యంలో జిల్లా అధికార యంత్రాంగం, టిఆర్ఎస్ శ్రేణులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా మంత్రి హరీశ్ రావు, కలెక్టర్ వెంకట్రామిరెడ్డి స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సీఎం పర్యటన పూర్తయ్యే వరకు పార్టీ శ్రేణులు, అధికార వర్గం ఎక్కడా అలసత్వం వహించొద్దని, ఏమరపాటు పడకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వహించాలని ఇప్పటికే మంత్రి హరీశ్ రావు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్ లో ఫారెస్ట్ కళాశాల, ఉద్యాన వన యూనివర్సిటీ, ఐఓసీ, దేశంలోనే ఎక్కడా లేని విధంగా నిర్మించిన ఇంటిగ్రేటెడ్ మార్కెట్, మహాతి ఆడిటోరియం తదితర అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేయనున్నారు. అదే విదంగా 100 కోట్లతో చేపట్టే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ, 100 పడకల మదర్ అండ్ చైల్డ్ ఆస్పత్రి, మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు సీఎం పర్యటన ఉంటుందని, మహతి ఆడిటోరియంలో పరిమిత సంఖ్యలో ప్రజాప్రతినిధులు, ఇతరులతో సీఎం ఆత్మీయ సమ్మేళనం ఉంటుందని మంత్రి హరీశ్ రావు తెలిపారు.

సీఏం కేసీఆర్ ఐదు ప్రారంభోత్సవాలతో పాటు మొత్తం 11 కార్యక్రమాల్లో పాల్గొంటారని అధికారులు తెలిపారు. ఒక్కొక్క కార్యక్రమం వద్ద జిల్లాస్థాయి అధికారి పర్యవేక్షణ జరపాలని, సీఏం వచ్చి వెళ్లే వరకూ కార్యక్రమం సాఫీగా జరిగేలా చూడాలని మంత్రి హరీశ్ రావు అధికార వర్గానికి సూచించారు. గేట్ వద్ద పాసులు ఉన్న వారినే అనుమతి ఇవ్వాలని ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ లో పండ్లు, పూలు, కూరగాయలు, మాంసం విక్రయదారులకు ప్రత్యేక పాసులు ఇచ్చి వారికి కేటాయించిన కౌంటర్లలో ఉండేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. మహాతి ఆడిటోరియంలో కళాప్రదర్శనలు ఏర్పాటు చేయడంతో కళాకారులకు సైతం ప్రత్యేక పాసులు జారీ చేయాలని నిర్ణయించారు. ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల వద్ద విద్యుత్తు శాఖ డీఈలు ఉండి విద్యుత్తు సరఫరా అంతరాయం కలుగకుండా చూడాలని మంత్రి సూచించారు. గజ్వేల్ పట్టణంతో పాటు ముఖ్యమంత్రి పాల్గొనే కార్యక్రమాల వద్ద పరిశుభ్రత, నీటి సదుపాయం, వైద్య కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. మొత్తం మీద ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటన సజావుగా సాగేలా మంత్రి హరీశ్ రావు పర్యవేక్షనలో జిల్లా అధికార యంత్రాంగం అన్ని చర్యలు తీసుకుంటున్నారు.

- Advertisement -