వైద్యారోగ్య‌శాఖ అధికారుల‌తో మంత్రి హ‌రీష్ స‌మీక్ష..

69
- Advertisement -

రాష్ట్రంలో జాతీయ స‌గ‌టును మించి వ్యాక్సినేష‌న్ పూర్త‌యింద‌ని వైద్యారోగ్య‌శాఖ మంత్రి త‌న్నీరు హ‌రీష్ రావు పేర్కొన్నారు. బుధ‌వారం నాటికి రాష్ట్రంలో 84.3 శాతం మందికి మొద‌టి డోస్ పూర్తి కాగా, 38.5 శాతం మందికి రెండో డోస్ వేశారని చెప్పారు. అదే స‌మ‌యంలో జాతీయ స్థాయిలో మొద‌టిడోస్ 79 శాతంగా, రెండో డోస్ 37.5 శాతంగా న‌మోదైంద‌ని వెల్ల‌డించారు. మంత్రి హ‌రీష్ రావు గురువారం హైద‌రాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారుల‌తో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రాష్ట్రంలో క‌రోనా ప‌రిస్థితులు, టీకాలు, కొత్త మెడిక‌ల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ ఆసుప‌త్రుల నిర్మాణం, వ‌రంగ‌ల్‌లోని మ‌ల్టీ సూప‌ర్ స్పెషాల్టీ ఆసుప‌త్రి నిర్మాణం త‌దిత‌ర అంశాల‌పై చ‌ర్చించారు.

నిర్మాణ ప‌నులు వేగంగా పూర్త‌య్యేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని, వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ వేగాన్ని మ‌రింత పెంచాల‌ని అధికారుల‌ను మంత్రి ఆదేశించారు. వ్యాక్సినేష‌న్ వేగం పెంచ‌డంలో భాగంగా శ‌నివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా విద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు. అధికారుల‌తో చ‌ర్చించిన అనంత‌రం ప‌లు ముఖ్యమైన నిర్ణ‌యాలు తీసుకున్నారు. అంత‌కుముందు కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మ‌న్సుక్ మాండ‌వీయ‌తో జ‌రిగిన వీడియో కాన్ఫ‌రెన్స్‌లో మంత్రి హ‌రీష్ రావు, వైద్యారోగ్య‌శాఖ ఉన్న‌తాధికారులు పాల్గొన్నారు. రాష్టంలో క‌రోనా కేసులు, వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మం గురించి వివ‌రించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఆరోగ్య‌శాఖ కార్య‌ద‌ర్శి రిజ్వి, సీఎం ఓఎస్డీ గంగాధ‌ర్‌, డీఎంఈ ర‌మేశ్‌రెడ్డి, కాలోజీ వ‌ర్సిటీ వీసీ క‌రుణాక‌ర్ రెడ్డి పాల్గొన్నారు.

స‌మావేశంలో తీసుకున్న నిర్ణ‌యాలు..
– క‌రోనా త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో 350 ప‌డ‌క‌లు గ‌ల కింగ్ కోఠి జిల్లా ద‌వాఖాన‌లో సాధార‌ణ వైద్య‌సేవ‌లు పున‌రుద్ధ‌ర‌ణ‌.
– టిమ్స్ హాస్పిట‌ల్‌లో 200 ప‌డ‌క‌లు (ఇవి కోవిడ్ చికిత్స కోసం) మిన‌హా సాధార‌ణ వైద్య సేవ‌లు ప్రారంభం.
– టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు చెల్లింపు.
– టిమ్స్ ఆసుపత్రి బకాయిలు చెల్లింపు.
– వ్యాక్సినేష‌న్ కార్య‌క్ర‌మంపై శ‌నివారం అన్ని జిల్లాల క‌లెక్ట‌ర్లు, డీఎంహెచ్‌వోల‌తో వీడియో కాన్ఫ‌రెన్స్.

- Advertisement -