అన్ని కార్యక్రమాల్లో తెలంగాణను అగ్ర స్థానంలో ఉంచాలి, ఆరోగ్య తెలంగాణ కల సాకారం చేయాలని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు అధికారులకు పిలుపునిచ్చారు. శనివారం కోఠిలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ కార్యాలయంలో వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో మంత్రి హరీష్ రావు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు పలు అంశాలపై దిశానిర్ధేశం చేశారు. ఆరోగ్య సూచిల్లో రాష్ట్ర సగటు కంటే తక్కువ ఉన్న జిల్లాలు పురోగతి సాధించాలి. ఆ దిశగా అధికారులు సత్వర చర్యలకు ఉపక్రమించాలి. విభాగాల వారీగా అధికారులు వారి పని తీరుపై సమీక్షలు నిర్వహించుకోవాలి, ప్రతి నెల విభాగాల వారీగా నేనూ సైతం సమీక్ష నిర్వహిస్తాను అని మంత్రి తెలిపారు.
పనితీరులో నెలవారీ వృద్ది కనిపించాలి, పదోన్నతులు, ప్రోత్సాహకాలకు అదే గీటు రాయి. అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించాలి, రిపోర్టులు సిద్దంగా ఉంచుకోవాలని సూచించారు. ప్రభుత్వం పెద్ద మొత్తంలో ప్రజారోగ్యానికి నిధులు ఖర్చు చేస్తున్నది, అదే స్థాయిలో ఆరోగ్య కార్యక్రమాల అమలులో శ్రద్ద చూపించాలని మంత్రి అన్నారు. రక్తహీనత విషయంలో రాష్ట్రం మరింత మెరుగ స్థితిలో ఉండాల్సి ఉంది, ఈ పరిస్థితిలో మార్పు రావాలి. రాష్ట్రంలో మలేరియా, డెంగ్యూ పరిస్థితుల గురించి అడిగి తెలుసుకుంటూ, ప్రభావిత జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించాలి. ప్రభావిత జిల్లాల అధికారులను అప్రమత్తం చేయాలి. పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖలతో సమన్వయం చేసుకుంటూ పరిసరాల పరిశ్రుభ్రతను మెరుగు పరుస్తూ, దొమల నివారణ చర్యలు చేపట్టాలి, తద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టాలని మంత్రి ఆదేశించారు.
అలాగే రాష్ట్రంలో ప్రసూతి మరణాలు తగ్గించేందుకు కృషి చేయాలి, ఆస్పత్రి ప్రసవాలను 97 శాతం నుండి 100 శాతానికి పెంచడం లక్ష్యంగా పని చేయాలి. ఇందులో ఎక్కువగా ప్రభుత్వ దవాఖానాల్లో ప్రసవాలు అయ్యేలా చూడాలి, సాధారణ ప్రసవాలు జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. రెండు వారాల్లో గాంధీ, ఉస్మానియా ఆసుపత్రుల్లో క్యాథ్ లాబ్స్ సిద్దం కావాలి. అలాగే వచ్చే నెల రెండో వారంలోగా ఖమ్మం లోని క్యాథ్ ల్యాబ్ పనులు పూర్తి చేసి, ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాలి అని మంత్రి తెలిపారు. ప్రజలకు అందిస్తున్న వైద్య సేవలు, ఇతర వివరాలను ఎప్పటికప్పుడు ఆరోగ్య శాఖ ఆన్ లైన్ ( హెచ్ఐఎంఎస్ )లో నమోదు చేయాలి. తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమైన పల్లె దవాఖానాల ఏర్పాటు వేగంగా పూర్తి చేయాలి. నెల నెలా పురోగతిపై సమీక్ష చేస్తా.. ప్రజలకు మెరుగైన వైద్యం అందించే లక్ష్యం చేరే క్రమంలో అన్ని రకాల మద్దతు ప్రభుత్వం అందిస్తుంది. ఉత్సాహంగా పని చేయాలి, ఎలాంటి సమస్యలున్నా పరిష్కరించేందుకు ప్రభుత్వం మీ వెంట ఉంటుందని మంత్రి అన్నారు.
ప్రసూతి మరణాలు తగ్గించే విషయంలో దేశంలో మనం నాల్గవ స్థానంలో ఉన్నాము, మొదటి స్థానంలోకి వచ్చేలా అందరం ఒక నిర్దిష్ట ప్రణాళికతో పని చేద్దామన్నారు. టీ డయాగ్నోస్టిక్స్ సేవలు దేశానికే ఆదర్శంగా నిలిచాయి. గత నెల బీహార్ ప్రభుత్వ అధికారులు మన రాష్ట్రాన్ని సందర్శించి టీ డయాగ్నోస్టిక్స్ సేవలు ప్రజలకు అందుతున్న తీరును పరీశిలించారు. వచ్చే వారం యూపీ నుండి ఆ తర్వాత కేరళ, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ బృందాలను రాష్ట్రానికి పంపుతున్నాయి. ఇవన్నీ మన ప్రభుత్వం ప్రజలకు అందిస్తోన్న మెరుగైన సేవలకు నిదర్శనం. ఇదే రీతిలో ఆరోగ్య సూచికల్లో తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలబడాలి అని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు.