ఏ విషయంలోనూ కేంద్రం నుంచి రాష్ట్రానికి మద్దతు లేదు అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. కేసీఆర్‌ను విమర్శించడం సరికాదు. దమ్ముంటే తెలంగాణలోని ఏ ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా తీసుకురా అని కిషన్ రెడ్డికి మంత్రి హరీశ్‌రావు సవాల్ విసిరారు. తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఉమ్మడి ఏపీలో తెలంగాణ ప్రజలు బానిస సంకెళ్లను బద్దలు కొట్టి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించారు. దేశ ప్రజలను ఇవాళ బీజేపీ నాయకులు బానిసలుగా చూస్తున్నారు. బానిసత్వానికి వ్యతిరేకమైన కేసీఆర్‌ను విమర్శించడం సరికాదు. ప్రజలు బీజేపీని నమ్మే స్థితిలో లేరు. కిషన్ రెడ్డికి దమ్ముంటే.. తెలంగాణలోని ఒక ప్రాజెక్టుకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇప్పించాలి. అప్పుడు మేం వచ్చి ఎయిర్‌పోర్టులోనే ఆయనకు దండలు వేస్తాం. నదుల అనుసంధానం జరిగితే తెలంగాణ సస్యశ్యామలం అవుతదని కిషన్ రెడ్డి అంటున్నారు. గోదావరి నీళ్లను కృష్ణాకు, కృష్ణా నుంచి పెన్నాకు, పెన్నా నుంచి కావేరికి నీళ్లను తీసుకుపోతామని అంటున్నారు. తెలంగాణ నీళ్లను కర్ణాటకు, తమిళనాడుకు తీసుకుపోతే మనం సమర్థించాలటా? అసలు కిషన్ రెడ్డి ఏ రాష్ట్ర ప్రయోజనాల కోసం మాట్లాడుతున్నారో అర్థం కావడం లేదు. తెలంగాణ భూభాగానికి సరిపోయిన నీళ్లను కేటాయించిన తర్వాతే మిగతా రాష్ట్రాలకు తీసుకెళ్లాలి అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
-కేసీఆర్‌ది ప్రజల భాష..
ముఖ్యమంత్రి కేసీఆర్ భాష గురించి మాట్లాడే హక్కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి లేదు అని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమంలో మాట్లాడిన భాషే కేసీఆర్ ఇవాళ మాట్లాడుతున్నారు. తెలంగాణ ప్రజల భాషను కేసీఆర్ మాట్లాడుతారు. మీది మతాల మధ్య చిచ్చు పెట్టే భాష. మతాల పట్ల ద్వేషాన్ని రెచ్చగొట్టే భాష మీది. కేసీఆర్‌ది ప్రజల భాష, సామాన్య ప్రజల భాష, పల్లెల్లో రైతులు మాట్లాడుకునే భాష అని హరీశ్ రావు స్పష్టం చేశారు.
-అమరవీరుల స్థూపం తాకే అర్హత కిషన్ రెడ్డికి లేదు..
కిషన్ రెడ్డికి అమరవీరుల గురించి మాట్లాడే అర్హత లేదు. అమరవీరుల స్థూపం కూడా తాకే అర్హత ఆయనకు లేదు. కేసీఆర్ ఆమరణ నిరాహార దీక్ష చేసి, ఢిల్లీని కూకటివేళ్లతో కదిలించి తెలంగాణను సాధించారు. సీమాంధ్ర నాయకులు ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి తెలంగాణ ఏర్పాటును అడ్డుకున్నారు. ఎంతో మంది తెలంగాణ బిడ్డలు త్యాగాలు చేశారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు రాజీనామా చేశారు. యెండల లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. కిషన్ రెడ్డి రాజీనామా చేయకుండా పదవిని పట్టుకున్నారు. తెలంగాణ ప్రజల పక్షాన నిలబడలేదు. జై ఆంధ్రా ఉద్యమానికి నాయకత్వం వహిస్తానని.. 2011, డిసెంబర్ 8న కిషన్ రెడ్డి ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ట్వీట్ చేశారు. రాజీనామా చేయకుండా ముఖం చాటేసి.. ఇవాళ సిగ్గులేని మాటలు మాట్లాడుతున్నారు. తెలంగాణ సమాజానికి వెన్నుపోటు పొడిచారు. యెండల లక్ష్మీనారాయణను గెలిపించుకునే పరిస్థితి నీకు లేదు. సొంత పార్టీ కాకపోయినా తెలంగాణ కోసం కేసీఆర్ యెండలను గెలిపించారు. అమరుల గురించి మాట్లాడే నైతికత కిషన్ రెడ్డికి లేదు అని హరీశ్ రావు అన్నారు.
-తెలంగాణ వచ్చింది కాబట్టే కేంద్రమంత్రివి అయ్యావ్..!
తెలంగాణ వచ్చింది కాబట్టే ఇవాళ కేంద్ర మంత్రివి అయ్యావు. 2019, ఆగస్టు 6న ఆర్టికల్ 370 మీద చర్చ జరిగినప్పుడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై అమిత్ షా అడ్డగోలుగా మాట్లాడారు. విద్వేషాన్ని చిమ్మారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బ్లాక్ డేగా వర్ణిస్తే.. కేంద్ర హోంశాఖ సహాయమంత్రిగా కిషన్ రెడ్డి బల్లలు చరిచారు. తెలంగాణ ఆత్మగౌరవాన్ని మోదీ దెబ్బతీసే విధంగా మాట్టాడితే కిషన్ రెడ్డి బల్లలు చరిచారు. మా చరిత్రను కించపరిచేలా మాట్లాడుతున్నావు అని మోదీని, అమిత్ షాను ఏనాడూ కిషన్ రెడ్డి నిలదీయలేదు అని మంత్రి హరీశ్ రావు ధ్వజమెత్తారు.
-సూటిగా సమాధానం చెప్పకుండా..
కేసీఆర్ అడిగిన దానికి సూటిగా సమాధానం చెప్పకుండా కిషన్ రెడ్డి అడ్డగోలు వాదనలు చేస్తున్నారు అని హరీశ్‌రావు మండిపడ్డారు. ఎఫ్‌సీఐకి బడ్జెట్‌లో రూ. 65 వేల కోట్లు కోత పెట్టారని కేసీఆర్ అడిగారు. ఉపాధి హామీకి రూ. 25 వేల కోట్లు తగ్గించారు. ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలకు రిజర్వేషన్ పెరగాలని కేసీఆర్ కోరారు. హైదరాబాద్‌కు వరదలు వస్తే కేంద్రం నుంచి నిధులు ఏమైనా మీరు ఇప్పించారా? తెలంగాణకు ఒక్క ట్రిపుల్ ఐటీ ఇవ్వలేదు. రాష్ట్రానికి ఒక్క ప్రాజెక్టు అయినా మీరు తెచ్చారా? మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించి.. రాష్ట్ర ప్రభుత్వం రూ. 364 కోట్లు ఇచ్చింది. మీరు ఇచ్చింది కేవలం రూ. 2.5 కోట్లు మాత్రమే. వీటన్నింటిపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలి. పేదల కడుపుకొట్టి గద్దలకు పంచి పెడుతున్నారు అని హరీశ్ రావు నిప్పులు చెరిగారు.