రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత లేదని…ఆర్మీ సాయంతో ఆక్సిజన్ రవాణా చేసుకున్నట్లు తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. అన్ని జిల్లాలకు ఆక్సిజన్‌ను రవాణా చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి రోజుకు 270 టన్నుల ఆక్సిజన్ అవసరం కాగా రోజుకు 400 టన్నుల ఆక్సిజన్ వచ్చేలా ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు.
రాష్ట్రంలో కరోనా కేసుల పెరుగుదల అంతగా లేదని, మహారాష్ట్రలోనూ కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నట్లు మంత్రి తెలిపారు. రోగులు పెరిగినా ఇబ్బంది రాకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.ప్రభుత్వ పరంగా ఉన్న ఐసోలేషన్ కేంద్రాల్లో చికిత్స కొనసాగుతుందన్నారు. గతంలోలాగా 14 రోజులు ఉంచుకోకుండా రోగి పరిస్థితి మెరుగ్గా ఉందని నివేదిక వస్తే కొద్ది కిందిస్థాయి సెంటర్లకు వారిని మార్చే యోచన చేస్తున్నట్లు తెలిపారు.
10 వేల బెడ్స్‌కు ఆక్సిజన్ సదుపాయం కల్పించినట్లు చెప్పారు. గాంధీలో అదనంగా మరో 400 ఆక్సిజన్ బెడ్లు, టిమ్స్‌లో అదనంగా 300, నాచారం ఈఎస్ఐ ఆస్పత్రిలో 350, నిమ్స్‌లో అదనంగా మరో 200 ఆక్సిజన్ బెడ్లు అందుబాటులోకి వచ్చినట్లు తెలిపారు.