సంక్షేమం-అభివృద్ధిలో తెలంగాణ నెం.1- మంత్రి ఎర్రబెల్లి

49
- Advertisement -

విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం మన ఊరు -మన బడి కార్యక్రమాన్ని చేపట్టిందని, దీనితో ప్రతి ప్రభుత్వ పాఠశాలను కార్పోరేట్ స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లా పాలకుర్తిలో పాలకుర్తి, కొడకండ్ల మండలాలు, దేవరుప్పుల మండలం రామరాజుపల్లి గ్రామంలో దేవరుప్పుల మండలాలల పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, జడ్పిటిసి, ఎంపిటిసి, ఎస్ఎంసి చైర్మన్లకు, సర్పంచులకు ఎంఈఓ, తదితర అధికారులకు మన ఊరు-మన బడి అవగాహనకై జిల్లా కలెక్టర్ శివలింగయ్యతో కలిసి నిర్వహించిన సదస్సులో మంత్రి పాల్గొని మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలోని గ్రామాల్లో త్రాగు, సాగునీరు, విధ్యుత్ లాంటి మౌళిక సదుపాయాలు కరువై పట్టణాలకు వలసలు పోయే వారని.. వలసలు పోయి పేదవారు సైతం ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చదివించుకుని ఆర్థికంగా నష్టపోయి.. అప్పుల ఊభిలో కూరుకుపోతున్నారని అన్నారు. నేడు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆద్వర్యంలో సాగు, త్రాగునీరు, విద్యుత్ లాంటి సౌకర్యాలు మెరుగుపర్చి.. రైతుబంధు, రైతుభీమా లాంటి పథకాల అమలుతో వలసపోయినవారు స్వగ్రామాలకు తిరిగివచ్చి… వ్యవసాయం చేస్తూ.. స్వగ్రామంలోనే ఉపాధి పొందుతున్నారని మంత్రి అన్నారు. పేద, ధనిక తేడాలు లేకుండా.. రాష్ట్రంలోని ప్రతి పాఠశాలలో చదివే పేద విద్యార్థులకు కూడా కార్పొరేట్ స్థాయిలో మౌలిక వసతులను కల్పించి.. విద్యను అందించే దిశగా ప్రణాళికలు తయారు చేయడం జరిగిందని తెలిపారు.

“మన ఊరు-మన బడి” కార్యక్రమంతో పాఠశాలల రూపురేఖలు మారబోతున్నాయని, ఇక మంచి చదువుల కోసం సుదూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేదని, ప్రతి పాఠశాలలోనూ ‘ఆంగ్ల మాధ్యమాన్ని’ ప్రవేశపెడుతున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశాలల్లో ఫర్నిచర్, ప్రహరీ గోడ నిర్మాణాలు, భవనాల, ఆట స్థలాల అభివృద్ధి పనులు, తాగునీటి నల్లాలు, మధ్యాహ్న భోజనానికి ఏర్పాట్లు, గర్ల్స్ కు ప్రత్యేక కిట్లు, పాఠ్యపుస్తకాలు, స్కాలర్షిప్స్ , మొదలగు అన్ని అవకాశాలను, సౌకర్యాలను విద్యార్థులకు అందజేయనున్నట్లు మంత్రి తెలిపారు. పాఠశాల ఆవరణలో గ్రినరీ, ఆకర్షణీయమైన పూల మొక్కలతో గార్డెన్, వాల్ పెయింటింగ్స్, విడతలవారీగా ఎంపిక చేయబడుతుందని చెప్పారు.

ప్రజల భాగస్వామ్యం ఉంటేనే ఏదైనా సాధించవచ్చని అందుకు అందరినీ కలుపుకుని సీనియర్ సిటిజెన్స్, పూర్వ విద్యార్థులు, యువకులతో, గ్రామ, బస్తీ వాసులతో కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రతి పాఠశాలను అందరి సహకారంతో అభివృద్ధి చేసుకోవాలని, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ జడ్పిటిసి, ఎంపిటిసి ఫండ్స్ గ్రామ బస్తీ పాఠశాల అభివృద్ధికి వినియోగించుకోవాలని, తమ గ్రామాల్లో ఉన్న పాఠశాలల అభివృద్ధికి యన్.ఆర్.ఐలు సహకరించాలని మంత్రి దయాకర్ రావు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఉమ్మడి వరంగల్ జల్లాలోని ప్రభుత్వ పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా తీర్చిద్దేందుకు కృషి చేయాలని అన్నారు.

- Advertisement -