ఇటీవల జరిగిన గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో విజయం సాధించిన కార్పోరేటర్‌లతో బుధవారం సమావేశం నిర్వహించారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ప్రజలకు సేవ చేయడం ద్వారా ప్రజల మన్ననలు పోంది రాజకీయ ఎదుగుదలకు పునాదులు వేసుకోవాలని నూతనంగా ఎన్నికైన కార్పోరేటర్లకు సూచించారు. తాత్కాలిక ప్రయోజనాల ద్వారా ప్రజల మన్ననలు పొందలేరని, ప్రజలకు సేవ చేస్తూ, జవాబుధారితనంతో పనిచేస్తే ప్రజల మధిలో ఎల్లకాలం నిలిచి పోతారన్నారు.
కరోనా విజృంభిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ధైర్యాన్ని కల్పిస్తూ.. వారికి సేవ చేయాలని, మీకు మంచి పేరు వస్తుందన్నారు. గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా వరంగల్ నగర అభివృద్దికి సియం కేసిఆర్, మంత్రి కేటిఆర్ లు అధిక ప్రాధాన్యతనిస్తూ, ఇప్పటికే పలు శాఖల ద్వారా 4126 కోట్ల నిధులతో అభివృద్ది పనులు చేసినట్లు చెప్పారు. వరంగల్ నగరాభివృద్దికి ఇంకా ఎన్ని నిధులైనా ఇవ్వడానికి సియం కేసిఆర్, మంత్రి కేటిఆర్ సిద్దంగా ఉన్నారని, టిఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న కృషికి అందరూ సహాకరించాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువయ్యే విధంగా మీరు వారధిగా పనిచేయాలని మంత్రి సూచించారు.
రాష్ట్ర ప్రజలకు సియం కేసిఆర్ పై ఉన్ననమ్మకం, మంత్రి కేటిఆర్ ప్రణాళికలతో వరంగల్ నగర ప్రజలు టిఆర్ఎస్ పార్టీకి ఘన విజయాన్ని అందించారు. రాష్ట్ర పార్టీ అద్యక్షులు, సియం కేసిఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటిఆర్‌లకు అండగా నిలిచి, ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చేందుకు కార్పోరేటర్లు అహర్నిషలు కృషిచేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటి సియం కడియం శ్రీహరి, ప్రభుత్వ చీఫ్ విప్ డి.వినయ్‌భాస్కర్, ఎమ్మెల్యేలు అరూరి రమేష్, చల్లా ధర్మారెడ్డి, డాక్టర్ రాజయ్య, ఎమ్పీ దయాకర్, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్‌రావు, జన్ను జకార్యా, సుందర్‌రాజు, తదితర నాయకులు పాల్గొన్నారు.