వరంగల్ మహానగరంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన, లోతట్టు ప్రాంతాలను పరిశీంచారు రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ప్రభుత్వ చీఫ్ విప్, వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్, వర్దన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, మేయర్ గుండా ప్రకాశ్ రావులతో కలిసి, స్వయంగా నీటిలోకి దిగి, కలియ తిరుగుతూ, జాతీయ విపత్తుల నివారణ టీమ్ తో కలిసి వరద, ముంపు బాధితులను ఒడ్డుకి చేర్చారు.
ప్రజలతో మాట్లాడి వాళ్ళని సురక్షితంగా చూసుకునే బాధ్యత ప్రభుత్వం తీసుకుందని తెలిపారు మంత్రి ఎర్రబెల్లి. ముంపు బాధితులకు పునరావాస కేంద్రాలతోపాటు, ఆహారం అందిస్తున్నామని…బాధితులకు అండగా నిలుస్తున్న జాతీయ విపత్తుల నివారణ టీమ్ ని అభినందించారు.
వరంగల్ నగరంలోని ములుగు రోడ్డు, కాశీబుగ్గ, పద్మానగర్, ఎస్ ఆర్ నగర్, చిన్నవడ్డెపల్లి చెరువు, తులసీబార్, కెయు 100 ఫీట్ల రోడ్డు, సమ్మయ్య నగర్, నయీంనగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు. మంత్రి వెంట స్థానిక కార్పొరేటర్లు, మున్సిపల్ కమిషనర్ పమేలా సత్పతి, వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల కలెక్టర్లు రాజీవ్ గాంధీ హన్మంతు, హరిత, సంబంధిత శాఖల అధికారులు ఉన్నారు.