పాలకుర్తి నియోజకవర్గంలోని అభివృద్ధి పనులు సాధ్యమైనంత వేగంగా పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరాశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులతో మంత్రి ఎర్రబెల్లి పాలకుర్తి లోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం నియోజవర్గంలోని పలు అభివృద్ధి పనులపై సమీక్ష చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆయా శాఖల వారీగా, పనుల వారీగా అధికారుల నుంచి సమాచారం తీసుకున్నారు. అయితే, పనులు పూర్తయినవని చెప్పడం కాకుండా, ఆయా పనులు ఉపయోగంలో ఉన్నాయా? లేదా అనేదే ముఖ్యమన్నారు. ఆ విధంగా వైకుంఠ దామాలను సర్వం సిద్ధం చేయాలన్నారు. నీరు, ఇతర అన్ని రకాల సదుపాయాలు అందులో ఉండే విధంగా ఉపయోగంలోకి తేవాలని ఆదేశించారు. రైతు వేదికలు, ప్రకృతి వనాలకు ప్రాధాన్యతనివ్వాలని, వాటిన్నంటినీ స్వయంగా పరిశీలించి, ఆదర్శంగా తీర్చిదిద్దాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
పాలకుర్తిలో ఒక అతిథి గృహానికి అవసరమైన స్థల సేకరణ వెంటనే జరిపి, నిర్మాణానికి శంకుస్థాపన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పిఎంజిఎస్ వై రోడ్లు మంజూరై, టెండర్లు కూడా పూర్తయిన సందర్భంగా వాటికి శంకుస్థాపనలు చేసే విధంగా అధికారులు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. మిషన్ భగీరథ నీటిని ప్రతి ఇంటికి అందేలా చర్యలు తీసుకోవాలని, ఎక్కడైనా సమస్యలుంటే వెంటనే పరిష్కరించాలని, సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇతర అభివృద్ధి పనులను కూడా మంత్రి సమీక్ష జరిపి, ఆయా అధికారులకు తగు సూచనలు చేశారు.