పీపీఈ కిట్ ధరించకుండా సీఎం కేసీఆర్ సాహసోపేతంగా గాంధీలోని కొవిడ్ వార్డుల్లో పర్యటించి, రోగులకు ధైర్యాన్ని కల్పించారన్నారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు, హైదరాబాద్‌లోని టిమ్స్ హాస్పిటల్ కోసం స్త్రీ నిధి ద్వారా రూ. 50 లక్షల విలువ చేసే ఆక్సిజన్ కాన్సంట్రేటర్స్‌ను కొనుగోలు చేసి స్థానిక ఆర్ అండ్ బీ గెస్ట్ హౌజ్‌లో కలెక్టర్లకు మంత్రి అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి ఎర్రబెల్లి మాట్లాడుతూ…ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స కోసం అన్ని రకాల వసతులు కల్పించామన్నారు. ముఖ్యమంత్రి చొరవతో ఎంజీఎం ఆస్పత్రి స్టాఫ్‌కు అన్ని వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఎంజీఎం రూపురేఖలను మార్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
ప్రధాని మోదీకి గుజరాత్ తప్ప.. ఇతర రాష్ర్టాలు కనిపించడం లేదన్నారు. కేంద్రం సహకరించకున్నా.. వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు గ్లోబల్ టెండర్లను ఆహ్వానించామని మంత్రి తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రికి మరో 275 ఆక్సిజన్ ఫ్లో మీటర్లు సమకూర్చామని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేర్కొన్నారు.